అక్కడ ఉన్నది జగన్. ఆయనకు తెలియనిది భయం. అసలు భయం అనే పదం జగన్ డిక్షనరీలోనే లేదు. ఎవరో ఏదో అంటూంటారు. కానీ ఇది అక్షరాలా వాస్తవం. ఈ మాటలు అన్నది ఎవరో కాదు టీటీడీ చైర్మన్ ఉమ్మడి విశాఖ వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించవద్దు అంటూ రెండేళ్ళుగా పోరాడుతున్న ఉక్కు కార్మిక సంఘాలు ప్రజా గర్జన పేరిట నిర్వహించిన అతి పెద్ద సభలో ఆయన పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు.
విశాఖ ఉక్కు అంటేనే ఆంధ్రులకు ఊపిరి. దాన్ని అమ్మేందుకు కేంద్రం చేసే ఏ ప్రయత్నం అయినా మేము అడ్డుకుని తీరుతాం. ఇది కచ్చితం. ముఖ్యమంత్రి జగన్ బయట ఒక మాట లోపల మరో మాట చెప్పే మనిషి కాదు అని ఆయన అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడే విషయంలో వైసీపీ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని అన్నారు.
విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయవద్దు అని అసెంబ్లీలో తీర్మానం చేశామని, పార్లమెంట్ లో తమ ఎంపీలు గళమెత్తి కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు అని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విషయంలో ప్రభుత్వం ఎంత చేయాలో అంతా చేస్తుందని ఆయన హమీ ఇచ్చారు.
తమ ప్రభుత్వం తెలుగుదేశం మాదిరిగా అసత్యాలు చెప్పదని అన్నారు. ప్రత్యేక హోదాని పూర్తిగా పక్కన పెట్టింది టీడీపీయే అని ఆయన ఆరోపించారు. విశాఖలోన్ హిందుస్థాన్ జింక్ కర్మాగారాన్ని తెగనమ్ముతూంటే చోద్యం చూసింది తెలుగుదేశమే అని ఆయన మండిపడ్డారు. విశాఖ ఉక్కు విషయంలో ఎందాకైనా అని ఆయన గట్టి భరోసా ఇచ్చారు.