హిండెన్ బర్గ్.. అదానీ కొంప ముంచింది. ఆ నివేదికతో అదానీ సంపద ఆవిరైంది. ఇంకా ఆవిరవుతూనే ఉంది. ఆ పతనం ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. ఆల్రెడీ పతనం దెబ్బ చవిచూశారు అదానీ. ప్రపంచ టాప్-10 బిలియనీర్లలో ఒకడిగా భారత్ కు అరుదైన ఘనత తీసుకొచ్చిన ఆయన, ఇప్పుడు టాప్-10 నుంచి బయటకొచ్చేశాడు. ఆయన ప్రపంచ టాప్-11 బిలియనీర్ మాత్రమే. బ్లూమ్ బర్గ్ బిలియనీర్ల జాబితాలో అదానీ 11వ స్థానానికి దిగజారారు.
గత మూడు ట్రేడింగ్ సెషన్లలో అదానీ సంపద 8 బిలియన్ డాలర్లు కరిగిపోయింది. కేవలం నెల రోజుల్లోనే ఆయన 36 బిలియన్ డాలర్లు కోల్పోయారు. గతేడాది అత్యథికంగా ఆర్జించిన భారతీయుడిగా గుర్తింపు పొందిన అదానీ, ఈ ఏడాది తొలి మాసంలోనే అత్యథికంగా నష్టపోయిన వ్యాపారవేత్తగా మొదటి స్థానంలో నిలిచారు. ప్రస్తుతం అదానీ సంపద 84.4 బిలియన్ డాలర్లు.
అదానీ తర్వాత 82.2 బిలియన్ డాలర్ల సంపదతో రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ 12వ స్థానంలో కొనసాగుతున్నారు. ప్రపంచ ధనవంతుల జాబితాలో బెర్నార్డ్ తొలిస్థానంలో ఉండగా, ఎలాన్ మస్క్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
అన్నీ షేర్లూ నష్టాల్లోనే..
హిండెన్ బర్గ్ రీసెర్చి నివేదిక ప్రభావంతో స్టాక్ మార్కెట్లలో అదానీ షేర్లు అమాంతం పడిపోయాయి. ఈరోజు ట్రేడింగ్ లో కూడా అదానీ టోటల్ గ్యాస్, అదానీ విల్మర్, అదానీ పవర్ లిమిటెడ్, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అదానీ గ్రీన్, అదానీ ట్రాన్స్ మిషన్ మాత్రం కాస్త కోలుకున్నప్పటికీ, ఇంకా క్రిటికల్ గానే ఉన్నాయి.
హిండెన్ బర్గ్ నివేదిక తప్పుల తడక అని, కేవలం వారి వ్యాపార లాభం కోసమే ఆ నివేదిక విడుదల చేశారని, అది దేశం మీద జరుగుతున్న దాడి అంటూ.. అదానీ ఎన్ని కవరింగ్ లు చేసినా ఫలితం లేకపోయింది. 413 పేజీల అదానీ లేఖని కూడా ఎవరూ నమ్మలేదు. దీంతో అదానీ షేర్లు భారీగా పడిపోయాయి, ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన్ను 11వ స్థానానికి పడేశాయి.