ఏపీలో మళ్ళీ మూడు రాజధానుల వ్యవహారం హాట్ హాట్ టాపిక్ గా మారింది. వికేంద్రీకరణ అన్నదే జగన్ సర్కార్ మాటగా ఉంది. ఈ విషయంలో రెండవ ఆలోచన కూడా ఎక్కడా లేదని స్పష్టం చేస్తున్నారు.
ఏపీలో అన్ని ప్రాంతాలు సమగ్రమైన అభివృద్ధి సాధించాలి అంటే మూడు రాజధానులు మూడు ప్రాంతాలలో ఉండడం మేలు అన్నది వైసీపీ నేతలు బల్ల గుద్ది చెబుతున్న మాట. ఈ నేపధ్యంలో కేంద్రంలోని బీజేపీ పెద్దల మాట ఏంటి అన్న సందేహాలు అందరిలో ఉన్నాయి.
విశాఖ టూర్ కి వచ్చిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అయితే ఏపీ బీజేపీ అభిప్రాయమే తమ అభిప్రాయం అని కుండ బద్ధలు కొట్టారు. ఏపీ బీజేపీ అమరావతే ఏకైక రాజధాని అంటోంది. దాని మీద అమరావతి రైతుల మహా పాదయాత్రకు కూడా బీజేపీ నేతలు మద్దతు ప్రకటించారు.
దాంతో అమరావతి రాజధానికే తాము కట్టుబడి ఉన్నామని బీజేపీ నేతలు చెప్పినట్లు అయింది. అదే తమ మాట అని కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి కూడా పేర్కొనడంతో కేంద్రం కూడా అమరావతి రాజధానికే ఫుల్ సొపోర్ట్ ఇస్తోందా అన్న చర్చ అయితే వస్తోంది. ఇక జగన్ సర్కార్ విశాఖకు రాజధాని ఇస్తామంటే కిషన్ రెడ్డి తాము విశాఖను టూరిజం పరంగా అభివృద్ధి చేస్తామని అంటున్నారు.
అంటే మొత్తానికి విశాఖ దేశంలో అద్భుతమైన ప్రాంతం అంటున్న కేంద్ర మంత్రి కానీ బీజేపీ పెద్దలు కానీ కనీసం తమ పరిధిలో ఉన్న ప్రాజెక్టులను అయినా మంజూరు చేస్తే విశాఖ ఎంతో కొంత అభివృద్ధి సాధిస్తుంది అంటున్నారు. సో విశాఖ విషయంలో అభిమానం ఉందంటూనే అమరావతికే మా ఓటు అంటున్న బీజేపీ టీడీపీ పార్టీల తీరుపైన విశాఖ జనాలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సిందే.