మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నిప్పులు చెరిగారు. గతంలో తన కుటుంబానికి జరిగిన అవమానాన్ని గుర్తు చేస్తూ…చంద్రబాబునూ గట్టిగా నిలదీస్తూ లేఖ రాశారు.
నాడు తన కుటుంబానికి జరిగిన అవమానానికి ఆత్మహత్య చేసుకోవాల్సింది అని వాపోయారు. కానీ మీ పతనం తన కళ్లతో చూడాలనే కాంక్షతో ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు ముద్రగడ ఆ లేఖలో ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
శపథాలు ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, మమతాబెనర్జీ లాంటి వాళ్లకే సొంతమని బాబును దెప్పి పొడిచారాయన. చంద్రబాబు చేసిన ముఖ్యమంత్రి శపథం నీటిమీద రాతగా గ్రహించాలని హితవు పలికారు. బాబుకు రాసిన ఆ లేఖలోని ముఖ్యాంశాలను తెలుసుకుందాం.
“గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గార్కి మీ ఉక్కు పాదాలతో అణచివేయబడ్డ మీ మాజీ మిత్రుడు ముద్రగడ పద్మనాభం నమస్కారములు.
అయ్యా మీ శ్రీమతి గారికి ఈ మధ్య జరిగిన అవమానం గురించి తమరు చాలా బాధపడుతూ ఆవేదనతో వెక్కి వెక్కి కన్నీరు కార్చడం టి.విలో చూసి చాలా ఆశ్చర్యపోయానండి. కొద్దోగొప్పో మీకన్నా మా కుటుంభానికి చాలా చరిత్ర ఉన్నదండి. మా తాత గారు పేరుకే కిర్లంపూడి మునసబు గాని, జిల్లా మునసబుగా పేరు గడించారు. నా తండ్రిని ప్రజలు ప్రేమతో రెండు దఫాలు ఉమ్మడి ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ శాసనభ్యుడిగా అసెంబ్లీకి పంపారండి.
మీరు, నేను 1978లో అసెంబ్లీలోకి అడుగు పెట్టడం జరిగింది. మీ మామయ్య గౌరవ శ్రీ ఎన్.టి.రామారావు గారి వద్ద, తరువాత మీ పిలుపు మేరకు మీవద్ద చాలా సంవత్సరాలు పనిచేసాను. ఎప్పుడు మీతో ఉన్నప్పుడు మీకు వెన్నుపోటు పొడవాలనే ప్రయత్నం చేయలేదండి.
మా జాతికి మీరిచ్చిన హామీ కొరకు దీక్ష మొదలుపెట్టిన మొదటి రోజునే గౌరవ తమరి పుత్రరత్నం గారు మా ఆవరణలో ఉన్న పోలీసు అధికారులకు తరచూ ఫోన్ చేసి ఆ లం..కొడుకుని (నన్ను) బయటకి లాగారా లేదా? తలుపులు బద్దలు కొట్టి నా శ్రీమతిని లం.. లెగవే అని బూటు కాలుతో తన్నించి ఈడ్చుకెళ్ళింది, నా కోడలిని లం.. నిన్ను కొడితే దిక్కెవరే అని తిట్టించింది.
నా కొడుకుని లాఠీలతో కొట్టుకుని తీసుకువెళ్ళింది తమకు గుర్తు లేదాండి? ఇప్పుడు తమరి నోటివెంట ముత్యాల్లాంటి వేదాలు వస్తున్నాయి. బాబు గారు మీ దృష్టిలో మాది లం..ల కుటుంబమా? మీరు, మీ శ్రీమతి గారు దేవతలా? మీ ఆఫీసులు దేవాలయాలా? మరి మేమేంటి, మా కొంపలు ఏమిటి?
ఆరోజున హెలికాప్టరు, తరువాత మరోకసారి సుమారు 6000 మంది పోలీసులను ప్రయోగించి నన్ను తీహార్ జైలుకు పంపాలని డ్రోన్ కెమారాలతో నిత్యం నిఘా పెట్టించి నా ఇంటి వద్ద భయంకరమైన వాతావరణం సృష్టించి, కార్గిల్ యుద్ధ భూమిని తలపించేలా చేసారు.
తమరికి ఆ సంఘటనలు గుర్తు చేయడం కోసమే తప్ప, తమరిని, మీ శ్రీమతి గారిని అవమానించడం కోసం ఈలేఖ వ్రాయలేదండి. ఇంకా లోతుగా రాయాలంటే పేజీలు సరిపోవు” అంటూ తన ఆవేదన, ఆక్రోశాన్ని ముద్రగడ తన లేఖలో వ్యక్తపరిచారు. సోషల్ మీడియాలో ముద్రగడ లేఖ వైరల్ అవుతోంది.