కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో అధికార పార్టీ వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. ఎలాగైనా చైర్మన్ ఎన్నిక వాయిదా వేయాలని అధికార పార్టీ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. బుధవారం కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని సంబంధిత కమిషనర్‌కు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో వైసీపీ ఎత్తుగడలన్నీ విఫలమయ్యాయి.
కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వరుసగా రెండోసారి మంగళవారం వాయిదా పడింది. ఎన్నిక విషయమై మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో గొడవ చోటు చేసుకుంది. దీంతో ఎన్నిక నిర్వహించే పరిస్థితి లేదని, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందంటూ చైర్మన్ ఎన్నికను ఆర్వో వాయిదా వేశారు. దీనిపై తెలుగుదేశం పార్టీ హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.
కొండపల్లి చైర్మన్ ఎన్నికలో చోటు చేసుకున్న పరిణామాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిక అధికారితో పాటు విజయవాడ సీపీని కూడా కోర్టుకు రావాల్సిందిగా ఆదేశించింది. మధ్యాహ్నం 2 గంటలకు పైన కోర్టు ఆదేశాల మేరకు పోలీస్, ఎన్నికల అధికారులు హైకోర్టుకు హాజరయ్యారు.
రేపే ఎన్నిక నిర్వహించాలని కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఎస్ఈసీ చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. ఎన్నికైన అభ్యర్థులకు రక్షణ కల్పించాలని సీపీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఫలితాలను మాత్రం ప్రకటించొద్దని హైకోర్టు సూచించింది.
వివరాలను కోర్టు ముందుంచాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అనవసరంగా అధికార పార్టీ పంతాలకు పోయి బొక్క బోర్లా పడినట్టైంది. ఎన్నికల్లో సత్తా చూపలేక, మరో రూట్లో కొండపల్లి నగర పంచాయతీని తన ఖాతాలో వేసుకోవాలనే అధికార పార్టీ పాచిక పారలేదు. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.