వైసీపీ ప్రభుత్వం మరో కీలక అంశంపై వెనకడుగు వేసింది. శాసనమండలిని రద్దు చేస్తూ… గతంలో అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని ఉపసంహరించుకుంది. ఈ మేరకు అసెంబ్లీలో ఉపసంహరణ తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. ఇప్పటికే సీఆర్‌డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను ప్రభుత్వం వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. సమగ్రంగా మళ్లీ ఈ బిల్లులను తీసుకొస్తామని జగన్ ప్రభుత్వం ప్రకటించింది.
జగన్ ప్రభుత్వంపై రకరకాల చర్చ సాగుతుండగానే, మరో కీలక నిర్ణయంపై ప్రభుత్వం తాను చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకో వడం విమర్శలకు దారి తీసింది. వైసీపీ ప్రభుత్వం పదేపదే రివర్స్ టెండర్స్ గురించి చెబుతున్న నేపథ్యంలో తన నిర్ణయాలపై కూడా అదే పంథాలో నడుస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శాసనమండలిలో సీఆర్‌డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులకు టీడీపీ తన బలాన్ని ప్రయోగించి అడ్డు తగిలిందని జగన్ రగిలిపోయారు.
దీంతో మండలినే రద్దు చేస్తే సమస్యే లేకుండా పోతుందని సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 2020, జనవరి 27న మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానించడం, దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపడం తెలిసిందే. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఆ తీర్మానాన్ని కోల్డ్ స్టోరేజీలో పెట్టింది. ప్రస్తుతం మండలిలో వైసీపీకి పూర్తిస్థాయి మెజార్టీ లభించడంతో మళ్లీ తన నిర్ణయాన్ని మార్చుకోవడం గమనార్హం.
రాజకీయంగా తనకు అనుకూల పరిస్థితి లేనప్పుడు మండలిని అనవసర ఆర్థిక భారంగా భావించిన అధికార పార్టీ… ఇప్పుడు మాత్రం తన పార్టీలోని నిరుద్యోగులకు పదవులు కట్టబెట్టే సభగా భావించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన ప్రకటించారు. ఈ మేరకు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
మండలి రద్దు నిర్ణయం తర్వాత సందిగ్ధత నెలకొందని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. ఈ సంధిగ్ధతను తొలగించేందుకు మండలిని తిరిగి కొనసాగించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని బుగ్గన చెప్పడం గమనార్హం. ఇంకా మున్ముందు ఇలాంటి అద్భుత ఆలోచనలు వైసీపీ ప్రభుత్వానికి ఏవేవి వస్తాయోనని సోషల్ మీడియాలో సెటైర్స్ పేలుతున్నాయి.