రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ మూడు రాజధానులపై కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులపై జగన్ ప్రభుత్వం నిన్న కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన మనసులో మాటను వెల్లడించారు.
ఏపీలో ప్రస్తుతం ‘ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం’ అన్నట్టుందని విమర్శించారు. అమరావతిని అలాగే ఉంచి కర్నూలులో సమ్మర్ లేదా వింటర్ క్యాపిటల్ పెట్టాలని మొదటి నుంచి తాను డిమాండ్ చేస్తున్నట్టు ఆయన గుర్తు చేశారు.
అశోకుడి పాలనలో కర్నూలు జిల్లాలోని జొన్నగిరి రాజధానిగా ఉండేదనిన్నారు. తమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని శ్రీ కృష్ణ కమిటీకి తెలియజేశామని ఆయన అన్నారు. వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి, తర్వాత హైకోర్టు కోసం ప్రయత్నం చేయాలని, లేకపోతే రెండూ పోతాయని జగన్ ప్రభుత్వాన్ని టీజీ హెచ్చరించారు.
మూడు రాజధానులపై మళ్లీ చట్టం చేసి కోర్టుకు వెళ్లితే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. అమరావతినే క్యాపిటల్‌గా ఉంచాలని స్పష్టం చేశారు. దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చన్నారు. అభివృద్ధి మాత్రం చేయాలని కోరారు.
రాజధానిని ముక్కలు చేయకుండా ఒక చోట సెక్రటేరియట్, మరోచోట శీతాకాల సమావేశాలు, ఇంకోచోట వేసవికాల సమావేశాలు నిర్వహిస్తే సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ తన సలహాలు వింటే బీజేపీని ఒప్పించే బాధ్యత తాను తీసుకుంటానని టీజీ వెంకటేశ్ ప్రకటించడం గమనార్హం.
ఇదిలా వుండగా రాయలసీమ వాసుల ఆకాంక్షలకు భిన్నంగా అమరావతిలో రాజధాని ఏర్పాటు చేశారని ఆ ప్రాంత ప్రజానీకం ఎప్పటి నుంచో ఆవేదన వ్యక్తం చేస్తోంది. రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం అమరావతిలోనే రాజధాని ఉండాలనే కొందరి డిమాండ్‌కు తలొగ్గి, తమ బానిస భావజాలాన్ని మళ్లీమళ్లీ తెరపైకి తెస్తున్నారని టీజీ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.
తండ్రొక పార్టీలో, తనయుడు మరో పార్టీలో వుంటూ…నీతిమాలిన రాజకీయాలకు పాల్పడుతూ… తమ పబ్బం గడుపుకునే వాళ్లు కూడా జగన్‌కు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.