నాగచైతన్య ప్రతి పుట్టినరోజుకు ఏదో ఒక ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుంటుంది. అలానే ఈసారి కూడా రిలీజైంది. కాకపోతే కాస్త వెరైటీ. ఇంకెంతో ప్రత్యేకం. నాగచైతన్యను ఒకే రోజు అటు మాస్ లుక్ లో, ఇటు క్లాస్ లుక్ లో చూసే అవకాశం దక్కింది అక్కినేని ఫ్యాన్స్ కి.
ఈరోజు నాగచైతన్య నుంచి ఒకేసారి 2 లుక్స్ వచ్చాయి. ఒకటి బంగార్రాజు, ఇంకోటి థాంక్యూ మూవీ. బంగార్రాజులో పక్కా మాస్ లుక్ లో, థ్యాంక్ యు సినిమాలో పక్కా క్లాస్ లుక్ లో కనిపించాడు చైతన్య.
ముందుగా బంగార్రాజు విషయానికొద్దాం.. ఈ లుక్ లో పూలచొక్కా, కళ్లజోడు, చేతికి బ్రాస్ లెట్, అదే చేతిలో కర్ర, ఎదురుగా బుల్లెట్.. ఇలా మాస్ ఎలిమెంట్స్ అన్నీ దట్టించారు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో నాగార్జున మాస్ లుక్ కు జిరాక్స్ కాపీలా చైతన్యను చూపించారు.
ఇక థాంక్యూ సినిమా చూస్తే, ఇందులో పూర్తిగా క్లాస్ లుక్ లో కూల్ గా కనిపిస్తున్నాడు చైతన్య. కళ్లద్దాలు పెట్టుకుని కాస్త గడ్డంతో ఉన్న నాగచైతన్య, తిరనాళ్లలోని తిరిగే రంగుల రాట్నంలోని గుర్రంపై ఎక్కి కూర్చుని తిరుగుతూ సంతోష పడుతున్నాడు. ఇలా ఒకే రోజు నాగచైతన్య నుంచి మాస్-క్లాస్ లుక్స్ వచ్చాయి.
కల్యాణకృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు సినిమా తెరకెక్కుతండగా.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ మూవీ తెరకెక్కుతోంది. మినిమం గ్యాప్ లో ఈ రెండు సినిమాలు థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.