2014 సీన్ ను 2024లో రిపీట్ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. బీజేపీ-జనసేనను చెరోవైపు పెట్టుకొని ముఖ్యమంత్రి పీఠం ఎక్కేయాలని కలలుకంటున్నారు. గడిచిన రెండేళ్లుగా ఇదే పనిపై ఉన్న బాబు, అందులో తొలి మెట్టు అధిగమించారు. విజయవంతంగా బీజేపీని తనవైపు తిప్పుకున్నారు.
అమరావతి ఉద్యమంలో తన పెయిడ్ ఆర్టిస్టులతో బీజేపీ కలవడం బాబుకు కలిసొచ్చింది. అమిత్ షా క్లాస్ పీకడంతో బీజేపీ నేతలు, అమరావతి ఉద్యమంలో కలిశారు. అంటే పరోక్షంగా టీడీపీతో కలిసిపోయారు. క్షేత్రస్థాయిలో టీడీపీ-బీజేపీ కార్యకర్తలు అమరావతి ఉద్యమం పేరుచెప్పి, ఒకరి భుజాలపై ఒకరు చేతులేసుకొని తిరుగుతున్నారు. అలా వారి ముసుగు తొలగిపోయింది.
నెల్లూరు జిల్లాలోకి అమరావతి యాత్ర ప్రవేశించిన తర్వాత బీజేపీ, టీడీపీ శ్రేణులు పోటా పోటీగా స్వాగతం పలికాయి. వారి వెంట నడిచాయి. రెండు పార్టీల ప్రముఖ నేతలు అమరావతి ఉద్యమం పేరుతో బయటికొచ్చినవారికి మద్దతు తెలిపారు.
విచిత్రం ఏంటంటే.. నిన్న మొన్నటి వరకు ఎడమొహం పెడమొహంగా ఉన్న బీజేపీ, టీడీపీ నేతలు ఇప్పుడు అమరావతి పేరుతో ఒక్కటయ్యారు. గతంలో ఎప్పుడు లేనంత సమన్వయం వారి మధ్య కనిపిస్తోంది.
పవన్ ఎంట్రీ ఎప్పుడు..?
చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చిన తర్వాత గంటల వ్యవధిలోనే రియాక్ట్ అయిన పవన్ కల్యాణ్, ఒకరకంగా స్వామిభక్తి చాటుకున్నారు. అయితే పవన్ ముసుగు తీసేందుకు ఇంకా సమయం రాలేదు. ఒకవేళ గతంలోనే తీద్దామనుకున్నా బీజేపీ అడ్డుపడింది. ఇప్పుడు ఆ అడ్డంకి కూడా తొలగిపోయింది.
ఇన్నాళ్లూ వైసీపీని విమర్శించినప్పుడు ఏదో మొహమాటానికి గతంలోని టీడీపీ ప్రభుత్వం కూడా ఇలాగే నిర్లక్ష్యం చేసిందని అనేవారు పవన్. ఇకపై ఆ మాట అనకపోవచ్చు.
మూడు రాజధానులపై సీఎం జగన్ తీసుకున్న తాజా నిర్ణయంతో పవన్ తీవ్రంగా విభేదిస్తున్నారు. వెనక్కి తీసుకున్నట్టే తీసుకుని, మరోసారి సమగ్ర బిల్లు ప్రవేశ పెడతామని చెప్పడం దారుణం అంటున్నారు. అంటే పవన్ కూడా ముసుగు తీసేందుకు రెడీ అవుతున్నారనమాట.
ఇప్పటికే టీడీపీ, బీజేపీ కలసిపోయాయి. త్వరలోనే పవన్ కూడా ఆ కూటమిలో చేరబోతున్నారు.