ఏపీలో జగన్ సర్కారు మూడు రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. దాన్ని గురించి మళ్ళీ మాట్లాడుకోవడం అనవసరం. ప్రస్తుత బిల్లుల్లో సాంకేతిక లోపాలు ఉన్నాయి కాబట్టి వెనక్కి తీసుకుంటున్నామని అంటే రద్దు చేస్తున్నామని, కానీ మరింత మెరుగైన, సమగ్రమైన బిల్లులను ప్రవేశపెడతామని ప్రభుత్వం చెప్పింది. మూడు రాజధానుల కాన్సెప్ట్ నుంచి వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇప్పుడు దీనిపైనే ఏపీలోనే కాదు తెలంగాణలోనూ చర్చ జరుగుతోంది. మీడియా మొత్తం దీని మీదనే ఫోకస్ చేసింది. కొత్త బిల్లులు ఎప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టేది సర్కారు చెప్పలేదు. కొత్త బిల్లుల్లో ఏముంటుందో తెలియదు. దీంతో అనేక రకాల ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి. అందులోనూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఇది ఇంటర్వెల్ మాత్రమే క్లైమాక్స్ కాదని చెప్పాడు. దీంతో జనాల్లో ఉత్కంఠ పెరుగుతోంది.
అమరావతి రాజధాని కాదని స్పష్టమైంది. జగన్ చెప్పిన మూడు రాజధానులేమిటో అందరికీ తెలిసిందే. పరిపాలన రాజధాని విశాఖ, శాసన రాజధాని అమరావతి, న్యాయ రాజధాని కర్నూలు. ఇప్పుడు పాట బిల్లులు రద్దు చేశారు కాబట్టి కొత్త బిల్లుల్లో ఈ నగరాల్లో మార్పు ఉంటుందా అని అందరూ ఆలోచిస్తున్నారు. కొత్త బిల్లులు పెడతామని ప్రభుత్వం చెప్పింది కాబట్టి కొత్తగా ఏదైనా ఉండాలి కదా. ఆ కొత్తదనం ఏమై ఉంటుంది అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. సీఎం చేసిన ప్రసంగాల ఆధారంగా కొందరు కొన్ని అంచనాలు వేస్తున్నారు. ఊహాగానాలు చేస్తున్నారు. పరిపాలన రాజధానిగా విశాఖ పట్టణం ఎందుకు సరైందో జగన్ తన ప్రసంగంలో వివరించాడు. విశాఖ బాగా అభివృద్ధి చెందిన నగరమని చెప్పాడు. దాని మీద ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్నాడు. ఇందులో అవాస్తవం ఏమీ లేదు.
అలాగే 1953 నుంచి 56 వరకు కర్నూలు ఆంద్ర రాష్ట్ర రాజధానిగా ఉన్న విషయాన్ని చెప్పాడు. అలాగే అప్పట్లో గుంటూరులో హైకోర్టు ఉన్న విషయాన్ని గుర్తు చేశాడు. దీన్నిబట్టి వేస్తున్న అంచనా ఏమిటంటే … పరిపాలనా రాజధానిగా విశాఖ అలాగే ఉంటుంది. హై కోర్టు ఇప్పుడు కూడా గుంటూరు పరిధిలోనే ఉంది కాబట్టి అదీ అలాగే ఉంటుంది. ఇక మిగిలింది కర్నూలు. దాన్ని శాసన రాజధానిగా చేస్తారు.
అమరావతిని రాజధానిగా చేయడానికి చాలా ఖర్చు అవుతుంది కాబట్టి హై కోర్టు ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని న్యాయ రాజధానిగా పరిగణిస్తారు. ఎందుకంటే న్యాయ రాజధానిని మార్చాలంటే సుదీర్ఘమైన ప్రక్రియ అవసరమవుతుంది. కాబట్టి వచ్చే ఎన్నికల నాటికి ఇది పూర్తయ్యే అవకాశం లేదు. రాజధాని ప్రాంతంలో 50వేల ఎకరాలకు లక్ష కోట్లు ఖర్చవుతాయని.. మౌలిక సదుపాయాల కల్పనకే లక్ష కోట్లు ఖర్చవుతాయని గత ప్రభుత్వ లెక్కలే చెప్పాయని జగన్మోహన్ రెడ్డి తెలిపాడు.
ఈ ప్రాంతంలో రోడ్డు, కరెంట్, నీళ్లు లాంటి కనీస అవరాలకు లక్ష కోట్లు ఖర్చవుతాయని.. డబ్బు లేనప్పుడు రాజధాని అనే ఊహా చిత్రం సాధ్యమవుతుందా అని ప్రశ్నించాడు. విశాఖ రాష్ట్రంలో పెద్ద నగరం .. దానిపై కొద్దిగా ఖర్చు పెడితే పెద్ద నగరాలతో పోటీ పడొచ్చునని జగన్ గుర్తు చేశాడు.
కొత్త బిల్లుల తయారీ కోసం అవసరమైతే మరో నిపుణుల కమిటీ వేస్తామని (మూడు రాజధానుల నిర్ణయం కోసం ) మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పాడు. జగన్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే అమరావతి హై కోర్టుకే పరిమితం కావొచ్చు. జగన్ మరో మాట కూడా అన్నాడు.
గత ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఉల్లంఘించి రాజధానిని ఖరారు చేసిందని.. అలా ఎంపిక చేసిన ప్రాంతం.. అటు గుంటూరు కాదు.. ఇటు విజయవాడ కాదని చెప్పాడు. సచివాలయం, చట్ట సభల మార్పుకు సుదీర్ఘమైన, క్లిష్టమైన ప్రక్రియ ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జగన్ చేసిన తప్పు ఏమిటంటే … అమరావతిని రాజధానిగా ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో అంగీకరించడం. ఆనాడే రాజధానిపై కసరత్తు చేసి మా అభిప్రాయం ఇదీ అని చెప్పి ఉంటే కథ మరోలా ఉండేది.