తన తనయుడు ఆర్యన్ ఖాన్ ను డ్రగ్స్ వినియోగదారుడిగా అరెస్టు చేసి, జైల్లో పెట్టి.. తనకు నిద్రలేని రాత్రులను మిగిల్చిన ఎన్సీబీపై బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ కోర్టును ఆశ్రయించనున్నాడా? ఈ కేసులో ఆర్యన్ ఖాన్ కు బెయిల్ ను కొన్నాళ్ల కిందటే ఇచ్చిన ముంబై కోర్టు, బెయిల్ స్టేట్ మెంట్ ను ఇటీవలే విడుదల చేసింది. ఆ స్టేట్ మెంట్ ప్రకారం… ఆర్యన్ ఖాన్ పై ఎన్సీబీ అధికారులు మోపిన అభియోగాలు ఏవీ ఆధారాలతో కూడుకున్నవి కాదని స్పష్టం చేసింది.
ఆర్యన్ ఖాన్ రెగ్యులర్ గా డ్రగ్స్ వాడుతున్నాడనేది ఎన్సీబీ మోపిన బలమైన అభియోగాల్లో ఒకటి. 23 యేళ్ల ఆ కుర్రాడికి చాలా కాలం నుంచి డ్రగ్స్ వినియోగం అలవాటు అన్నట్టుగా ఎన్సీబీ బలమైన ఆరోపణ చేసింది. మరి అందుకు ఆధారం ఏమిటంటే.. అతడి వాట్సాప్ చాట్ లే అనే లీకు ను మీడియాకు ఇవ్వడంతో పాటు, కోర్టు కు కూడా సమర్పించింది.
మీడియా అంటే.. తమకు నచ్చని వారిని ఇలాంటి ఆధారాలతో ట్రయల్స్ నిర్వహించి, వారికి శిక్షలు కూడా వేస్తుంది. అయితే కోర్టు కు మాత్రం ఆ వాట్సాప్ చాట్ లిస్టులో తప్పేం కనిపించలేదు.
ఎన్సీబీ మోపిన అభియోగాలు ఆధారాలు లేనివని కోర్టు స్పష్టం చేసింది. అంతే కాదు.. ఆర్యన్ ఖాన్, అతడి సన్నిహితుల నుంచి పోలీసులు తీసుకున్న కన్ఫెషన్ స్టేట్ మెంట్ కూడా చెల్లేది కాదని కోర్టు స్పష్టం చేసినట్టుగా సమాచారం. ఈ క్రమంలో ఆర్యన్ ఖాన్ అరెస్టు, ఈ కేసు విచారణలో కీలక పాత్ర పోషించిన సమీర్ వాంఖేడే తీరు మరింత చర్చనీయాంశం అవుతోంది.
ఈ కేసులో ఆర్యన్ కు బెయిల్ రాకముందే.. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు దుమారం రేపాయి. ఆర్యన్ క్రూజ్ షిప్ లో దొరకడంతో సమీర్ వాంఖేడే డబ్బులు ఆశించాడని, ఆ మేరకు సంప్రదింపులు కూడా జరిగాయని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పడం సంచలనంగా నిలిచింది. ఇక వాంఖేడేపై ఎన్సీపీ నేత ఒకరు సంచలన ఆరోపణల పరంపరను కొనసాగిస్తూ ఉన్నారు.
ఇప్పుడు ఈ కేసులో మరింత సంచలనం చోటు చేసుకోనున్నదని, షారూక్ ఖాన్ స్వయంగా న్యాయపోరాటానికి సిద్ధం అవుతున్నాడని.. తన కొడుకును ఈ కేసులో ఫ్రేమ్ చేశారని కోర్టును ఆశ్రయించబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి అదే నిజమైతే.. ఈ కేసులో ఎన్సీబీ ముంబై విభాగం గట్టి విచారణను ఎదుర్కొనాల్సి రావొచ్చు.
ఆర్యన్ ఖాన్ కు పక్షం రోజుల పైనే బెయిల్ దక్కనీయకుండా వివిధ రకాల అభ్యంతరాలను చెప్పిన ఎన్సీబీ, అనేక సమాధానాలను చెప్పుకోవాల్సి రావొచ్చేమో!