సెలబ్రిటీలు తమ కోపతాపాలను సోషల్ మీడియా ద్వారా చూపించే రోజులు ఇవి. తమ ప్రేమ, దాంపత్య బంధాలకు సంబంధించిన అంశాలపై కూడా సోషల్ మీడియా ద్వారానే వారు జనాలకు ఎంతో కొంత క్లారిటీ కూడా ఇస్తూ ఉంటారు. నచ్చిన వ్యక్తి పేరులో మొదటి అక్షరాన్ని సోషల్ మీడియాల్లో షేర్ చేయడంతో మొదలుపెడితే.. ఇలాంటి డైరెక్టు, ఇన్ డైరెక్టు తతంగాలు చాలా నడుస్తూ ఉంటాయి.
ఈ క్రమంలో నటి సమంత ఇటీవల తన విడాకులపై ముందుగా ఇన్ స్టాగ్రమ్ లో పేరు మార్పిడి ద్వారానే క్లారిటీ ఇచ్చినట్టుగా ఉంది. సమంత అక్కినేని అనే తన నేమ్ ను ఎడిట్ చేసి కేవలం ఎస్ అనే అక్షరాన్ని మాత్రమే అలాగే ఉంచి సమంత రూమర్లకు తెర లేపింది. ఆ రూమర్లను అప్పట్లో ఖండించినా, ఆ తర్వాత వేరుపడటం, విడాకులు అయితే జరిగిపోయాయి.
ఇప్పుడు మరో స్టార్ హీరో యిన్ ఇన్ స్టాలో తన పేరును ఎడిట్ చేసుకుంది. సమంత తన భర్త ఇంటి పేరును తీసేసినట్టుగా, ఈమె తన పేరుకు యాడ్ చేసుకున్న భర్త పేరునే తీసేసింది. తనెవరో కాదు ప్రియాంకా చోప్రా. వయసులో తనకన్నా చాలా చిన్నవాడైన అమెరికన్, నిక్ జోనస్ ను పెళ్లి చేసుకున్న ప్రియాంక.. తన భర్త పేరును ఇన్నాళ్లూ తన పేరు వెనుక ఉంచింది. సోషల్ మీడియాలో ప్రియాంక చోప్రా జోనస్ గా తన పేరును పెట్టుకుంది. ఉన్నట్టుండి ఇప్పుడు జోనస్ ను కట్ చేసింది. ఒట్టి ప్రియాంక చోప్రాగా మిగిలింది.
మరి ఈ మార్పు కేవలం సాంకేతికమా? లేక ప్రియాంక కూడా సమంతను అనుసరిస్తున్నట్టా? అనేది చర్చనీయాంశంగా మారిందిప్పుడు. ప్రియాంక, నిక్ లు విడిపోతారంటూ ఇప్పటికే మీడియాలో కుప్పలతెప్పల కథనాలు వచ్చాయి. వాటిపై ప్రియాంక కోర్టును కూడా ఆశ్రయించింది. ఇప్పుడు ఈమె పేరు మార్పిడి వ్యవహారంతో మళ్లీ బ్రేకప్ ఊహాగానాలు ఊపందుకున్నట్టున్నాయి. దాదాపు మూడేళ్ల కిందట వీరికి పెళ్లైంది. ఇటీవలే దీపావళి పండగను కూడా వీరు జంటగా జరుపుకుని ఫొటోలను పోస్టు చేశారు.