మూడు రాజధానులకు సంబంధించి రాజధాని వికేంద్రీకరణ బిల్లును కొత్తగా రూపొందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఉన్న బిల్లులో న్యాయపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతున్నందున దాన్ని రద్దు చేసిన సర్కారు కొత్త బిల్లు రూపొందిస్తుందని ఆయన ప్రకటించారు. అన్ని ప్రాంతాల సమానాభివృద్ధికి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం అని జగన్ విస్పష్టంగా ప్రకటించారు. అయితే.. జగన్ సర్కారు ఏర్పడిన కొత్తలో తీసుకువచ్చిన వికేంద్రీకరణ బిల్లుకు సభలో ఎదురైన కష్టాలు ఈసారి ఉండవు.
కొత్త బిల్లు రూపకల్పనకు ఎంత కాలం పడుతుందనేది ఇదమిత్థంగా చెప్పలేం గానీ.. బిల్లు తయారైన వెంటనే శాసనసభలో ఉభయ సభల ఆమోదం పొందడమూ గవర్నరు ముద్రతో చట్టం రూపు దాల్చడమూ ఒకేరోజులో జరిగేపోయే అవకాశం ఉంది.
గతంలో జగన్ సర్కారు వికేంద్రీకరణ బిల్లు తెచ్చినప్పుడు- శాసనసభలో దానికి అనేక కష్టాలు ఎదురయ్యాయి. శాసనసభలో అపరిమితమైన మెజారిటీ ఉన్నప్పటికీ.. మండలిలో ఆరోజు నాటికి వైసీపీ బలహీనమైన పార్టీగా ఉంది. దానికి తోడు మండలి ఛైర్మన్ షరీఫ్ కూడా తెలుగుదేశానికి చెందిన వారు కావడంతో వారి బిల్లు గట్టెక్కడం జరగలేదు.
శాసనసభలో చిటికెలో బిల్లును ఆమోదించేసిన సర్కారు, పెద్దల సభ దగ్గర బోల్తా పడింది. నానా రభసా జరిగింది గానీ.. బిల్లు మాత్రం గట్టెక్కలేదు.
జగన్మోహన్ రెడ్డికి తెగ కోపం వచ్చేసింది. ఆ కోపంలో ఆయన ఏకంగా శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి కౌన్సిల్ ను రద్దు చేసి పారేశారు. కానీ ఆ నిర్ణయం కూడా ఆగిపోయింది. అప్పటికి తెలుగుదేశం పార్టీ మెజారిటీ సభ్యులు కలిగిఉన్న శాసనమండలి మీద జగన్ ఆగ్రహంగానే ఉన్నారు.
కానీ, ఈ రెండున్నరేళ్లూ గడిచేసరికి పరిస్థితి మొత్తం మారిపోయిది. అంతా వైసీపీకి అనుకూలంగా మారింది. ఇప్పుడు శాసనమండలిలో వైసీపీ ప్రాబల్యం బాగా పెరిగింది. మండలి ఛైర్మన్ గా కూడా వైసీపీకి చెందిన మోషెన్ రాజు ఉన్నారు.
ప్రస్తుతం మండలిలో 33 మంది ఎమ్మెల్సీ బలం వైసీపీకి ఉంది. మిత్రపక్షాలు ఇండిపెండెంట్ల మద్దతు కూడా కలుపుకుంటే వారి బలం 41 గా ఉంటుంది. ఏ బిల్లునైనా చిటికెలో ఆమోదింపజేసుకోవడానికి సరిపోయే మద్దతు ఇది. తెలుగుదేశంకు ఉన్నది 15 మంది సభ్యులు మాత్రమే. ప్రతిపక్షంగా ఎంచదగిన బీజేపీకి మరో ఇద్దరున్నారు. ఈ రెండు పార్టీలు కలిసినా.. మూడింట ఒక వంతు కన్నా తక్కువ. ఈ నేపథ్యంలో జగన్ సర్కారు మండలి గండం లేదు.
మూడు రాజధానులకు సంబంధించి కొత్త బిల్లు తయారు కాగానే ఉభయ సభలలో ఒకే రోజులో ఆమోదింపజేసుకుని.. గవర్నరు సంతకంతో చట్టం చేసేయాలనేది ప్లాన్. మళ్లీ ఆ చట్టం మీద ఎవరైనా కోర్టులను ఆశ్రయించి.. కోర్టులు స్టే ఇచ్చేలోగా పనులు కూడా ప్రారంభించేయాలనే ప్లాన్ తో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది.