కళకళలాడుతున్న బస్సు డిపోలు

ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ఆర్టీసీ డిపోలన్నీ కళకళలాడుతున్నాయి. ఉదయం 5 గంటల నుంచే కార్మికులు విధుల్లో చేరుతున్నారు. షెడ్యూల్ ప్రకారం బస్సులన్నీ రోడ్లపైకి వస్తున్నాయి. తమకు ఎలాంటి షరతులు విధించకుండా తిరిగి…

ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ఆర్టీసీ డిపోలన్నీ కళకళలాడుతున్నాయి. ఉదయం 5 గంటల నుంచే కార్మికులు విధుల్లో చేరుతున్నారు. షెడ్యూల్ ప్రకారం బస్సులన్నీ రోడ్లపైకి వస్తున్నాయి. తమకు ఎలాంటి షరతులు విధించకుండా తిరిగి విధుల్లోకి తీసుకోవడంతో కార్మికులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

రాత్రి కేసీఆర్ మాటలు విన్న తర్వాత కార్మికులంతా పొద్దున్నే డిపోల ముందు బారులుతీరారు. సమ్మె సమయంలో మరణించిన కార్మికులకు నివాళులు అర్పించి విధుల్లో చేరిన వైనం కొన్ని డిపోల్లో కనిపించింది. హైదరాబాద్ తో పాటు ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లోని దాదాపు అన్ని డిపోలా వద్ద కోలాహలం కనిపించింది.

మరోవైపు 50 రోజులకు పైగా సేవలందించిన తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు ఇవాళ్టి నుంచి ఆర్టీసీ నుంచి తప్పుకుంటున్నారు. సమ్మె రోజుల్లో వీళ్లంతా చక్కగా పనిచేశారని, తాత్కాలిక ఉద్యోగుల విషయంలో సానుభూతితో ఉంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

మరోవైపు పెంచిన చార్జీలు సోమవారం నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఆర్టీసీ సంక్షేమం కోసం కిలోమీటర్ కు 20 పైసలు చొప్పున టిక్కెట్ రేటు పెంచబోతున్నట్టు సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. తద్వారా 760 కోట్ల అదనపు ఆదాయాన్ని అంచనా వేస్తోంది ప్రభుత్వం.

అటు తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆర్టీసీ యూనియన్లు కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. సమ్మె సమయంలో చనిపోయిన కార్మికుల కుటుంబాల్ని తాము కూడా ఆదుకుంటామని కార్మిక నాయకులు ప్రకటించారు. ఎప్పట్లానే భవిష్యత్తులో కూడా కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తామని అంటున్నారు.