అర్జున్ సురవరం సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర ఘటనను షేర్ చేసుకున్నాడు హీరో నిఖిల్. ఒక దశలో నటుడు పోసాని, దర్శకుడికి మధ్య పెద్ద గొడవ జరిగిన విషయాన్ని బయటపెట్టాడు. గ్రేట్ ఆంధ్రకు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఇలాంటి చాలా విషయాల్ని చెప్పుకొచ్చాడు నిఖిల్.
“అర్జున్ సురవరం షూటింగ్ టైమ్ లో నేనెప్పుడూ టెన్షన్ పడలేదు. కానీ ఒకసారి మాత్రం బాగా టెన్షన్ పడ్డాను. పోసాని గారితో వర్క్ చేస్తున్నప్పుడు.. డైరక్టర్ కు, పోసానికి మధ్య చిన్న గొడవ జరిగింది. పోసాని ఏ సీన్ చేసినా 2-3 టేకుల్లో ఓకే అయిపోతుంది. డైరక్టర్ మాత్రం 16-17 టేకులు చేయించారు. దీంతో పోసానికి కోపం వచ్చి దూరంగా వెళ్లిపోయారు. వెంటనే డైరక్టర్ వచ్చి తను ఫస్ట్ టైమ్ డైరక్టర్ అని, కొంచెం హెల్ప్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాడు. అప్పుడు పోసాని గారు మళ్లీ సెట్స్ పైకి వచ్చి లేట్ నైట్ వరకు ఉండి ఆ సీన్ చేశారు.”
షూటింగ్ మొత్తంలో తనను కాస్త టెన్షన్ కు గురిచేసిన ఘటన ఆ గొడవ మాత్రమే అంటున్నాడు నిఖిల్. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్.. చిరంజీవి తనను తమ్ముడు అని పిలుస్తుంటే చాలా థ్రిల్ ఫీల్ అయ్యానని చెప్పుకొచ్చాడు.
“చిరంజీవి వచ్చి నన్ను ఓ కుటుంబ సభ్యుడిలా తమ్ముడు అని పిలవడం చాలా థ్రిల్ అనిపించింది. అది ఆయన గొప్పదనం. చిరంజీవి ఓ గొప్ప వ్యక్తి. ఆయన గొప్పదనం తెలియాలంటే ఆయన్ను దగ్గర్నుంచి చూడాల్సిందే. సినిమా రిలీజ్ అవ్వలేదంటే అంతా సానుభూతి చూపిస్తారు, హెల్ప్ చేసేది తక్కువ. కానీ ఏమీ ఆశించకుండా చిరంజీవి వచ్చి సపోర్ట్ చేశారు. హెల్ప్ చేశారు. ఈ సినిమాను ఆయన రియల్ లైఫ్ హీరోలా వచ్చి కాపాడారు.”
అర్జున్ సురవరం సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. ఎంటర్ టైన్ మెంట్ తో పాటు మంచి సందేశం కూడా ఉందని, తమ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుందని అంటున్నాడు నిఖిల్.