అమరావతి శ్మశానంలా ఉందంటూ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలతో రాజధాని ప్రాంత పరువుపోయిందంటూ గగ్గోలు పెడుతూ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు తన పరువు తానే తీసుకున్నారు. రాజదాని శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో సాష్టాంగ నమస్కారం చేసి డ్రామా రక్తికట్టించాలని చూశారు. కానీ శిలాఫలకానికి చుట్టూ ఓ స్మారకాన్ని కూడా నిర్మించలేదు. కేవలం మహూర్తం రోజున మినహా ఉద్ధండరాయునిపాలెంలోని ఆ ప్రాంతాన్ని తర్వాత అసలేమాత్రం పట్టించుకోలేదు. ఈ వైఫల్యాలన్నీ బాబు పర్యటనతోనే బైటపడ్డాయి.
రాజధాని ప్రాంతానికి శంకుస్థాపనంటే కనీసం ఓ స్మారకమైనా ఏర్పాటుచేయాలి. బాబు అలాంటి పనులేం చేయలేదు. ఇలా తన తప్పులన్నీ తానే బైటపెట్టుకున్నారు చంద్రబాబు. బాబు వెళ్లి సాష్టాంగం చేసేవరకు అక్కడ స్మారకం ఒకటి ఉంటే బాగుండేదనే ఆలోచన ఎవరికీ రాలేదు. టీడీపీ హయాంలో ఐదేళ్లలో కనీసం స్మారకం కూడా నిర్మించలేకపోయారంటూ ఇప్పుడు కొత్తగా మరో ట్రోలింగ్ మొదలైంది.
ఇదంతా ఒకెత్తు అయితే చినబాబు వ్యాఖ్యలు కూడా టీడీపీ వైఫల్యాలను చెప్పకనే చెబుతున్నాయి. మరో 3 నెలలు అధికారం తమ చేతిలో ఉంటే రాజధాని పూర్తయి ఉండేదని తలాతోకా లేకుండా మాట్లాడారు లోకేష్. ఐదేళ్లలో చేయని పని, మూడు నెలల్లో చేస్తారట, నమ్మశక్యం కాని ఇలాంటి మాటలతో చినబాబు, పెదబాబు పరువుని మరింత తీసేశారు.
మొత్తమ్మీద బొత్స వ్యాఖ్యలు, వాటికి కౌంటర్ గా చంద్రబాబు పర్యటన.. ఈ ఎపిసోడ్ అంతా టీడీపీ పరువుని బజారున పెట్టింది. రాజధానిలో ఏమీ జరగలేదని, చెప్పుకోడానికి కనీసం స్మారకం కూడా లేదనే విషయాన్ని మరోసారి స్పష్టమయ్యేలా చేసింది. అమరావతి పరువు పోయిందని గోలపెడుతున్న బాబు.. అనవసరంగా బస్సు యాత్ర చేసి తన పరువు తానే తీసుకున్నారు.