మంత్రులకు పరీక్షా కాలం.. మొదలైన టెన్షన్

“వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఓసారి జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల బాధ్యతల్ని మంత్రులకు అప్పగించారు వైఎస్ఆర్. అయితే అప్పుడు కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాలో తక్కువ సీట్లు వచ్చాయి.…

“వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఓసారి జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల బాధ్యతల్ని మంత్రులకు అప్పగించారు వైఎస్ఆర్. అయితే అప్పుడు కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాలో తక్కువ సీట్లు వచ్చాయి. దీంతో సంబంధిత మంత్రుల్ని పదవుల్ని తప్పించారు ఆనాటి ముఖ్యమంత్రి.” 

ఇప్పుడు ఇదే ఫార్ములాను జగన్ కూడా ఫాలో అవ్వాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతల్ని మంత్రులకు కేటాయించి, సరైన ఫలితాలు చూపించని మంత్రులకు ఉద్వాసన పలకాలని జగన్ సూచనప్రాయంగా ఓ నిర్ణయానికి వచ్చారు. దీంతో మంత్రుల్లో కొత్త టెన్షన్ మొదలైంది.

మార్చి నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేస్తామని హైకోర్టుకు తెలిపింది ఏపీ సర్కార్. సో.. మంత్రులకు మార్చి డెడ్ లైన్ అన్నమాట. నిజానికి మంత్రిపదవులు పొందిన వాళ్లంతా రెండున్నరేళ్ల వరకు తమ పదవికి ఎలాంటి ఢోకా ఉండదని భావిస్తూ వచ్చారు. ఆ తర్వాత ముదింపు వేసి, కొందర్ని జగన్ పదవుల నుంచి తప్పిస్తారని అంతా అనుకున్నారు.

కానీ మంత్రుల పనితీరుకు స్థానిక సంస్థల ఎన్నికలకు ముడిపెట్టారు ముఖ్యమంత్రి. ఈ ఎన్నికలు ప్రభుత్వ పనితీరుగా కొలమానంగా మారుతాయి కాబట్టి, కచ్చితంగా అవి మంత్రుల పనితీరుతో ముడిపడి ఉంటాయి కాబట్టి మినిస్టర్లందరికీ మార్చి నెలకు డెడ్ లైన్ గా విధించారు ముఖ్యమంత్రి.

నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీదే పైచేయిగా నిలుస్తుంది. ఈ విషయంలో పాలకపక్షం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇప్పటికే కొందరు మంత్రుల్లో అలసత్వాన్ని గమనించిన ముఖ్యమంత్రి, కావాలనే ఈ టార్గెట్ ను పెట్టినట్టు తెలుస్తోంది. ఇలాగైనా మంత్రులు కష్టపడి పనిచేస్తారని, ప్రభుత్వ కార్యక్రమాలు-పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తారనేది జగన్ ఆశ.