నాటు-నాటు డాన్స్ వెనక స్టోరీ బయటపెట్టిన ఎన్టీఆర్

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి నాటు-నాటు పాట ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. ఆడియోతో పాటు ఆ పాటలో ఎన్టీఆర్-చరణ్ జాయింట్ గా వేసిన ఫుట్ స్టెప్ చాలా వైరల్ అయింది. ఎంతోమంది ఆ…

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి నాటు-నాటు పాట ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. ఆడియోతో పాటు ఆ పాటలో ఎన్టీఆర్-చరణ్ జాయింట్ గా వేసిన ఫుట్ స్టెప్ చాలా వైరల్ అయింది. ఎంతోమంది ఆ స్టెప్ ను అనుకరిస్తూ, వేల సంఖ్యలో వీడియోలు చేస్తున్నారు. అలా సూపర్ హిట్టయిన ఆ డాన్స్ మూమెంట్ పై ఎన్టీఆర్ స్పందించాడు.

నాటు-నాటులో ఆ ఫుట్ మూమెంట్ పై షూటింగ్ స్టేజ్ లో తనకు ఎలాంటి అంచనాల్లేవని అన్నాడు ఎన్టీఆర్. అన్ని మూమెంట్స్ లానే ఆ స్టెప్ ను కూడా చరణ్ తో కలిసి వేశానని, కానీ చరణ్ కు నాకు సింక్ కోసం రాజమౌళి పదేపదే ఆ స్టెప్ ను అన్ని సార్లు ఎందుకు రిహార్సల్స్ చేయించాడో ఇప్పుడు అర్థమైందంటున్నాడు తారక్.

“అదొక చిన్న ఫుట్ మూమెంట్. కానీ టేక్ తర్వాత టేక్ చేస్తూనే ఉన్నాం. మా ఇద్దరి కాళ్లు ఎడమ-కుడి వైపు, పైకి-కిందకి కదలాలి. అది కూడా పెర్ ఫెక్ట్ టైమింగ్ లో కదలాలి. ఆ స్టెప్ కోసం 15-18 టేకులు తీసుకున్నాం. రాజమౌళి ఆ స్టెప్ ను రికార్డ్ చేసి ప్రతి ఫ్రేమ్ ను ఫ్రీజ్ చేసి చెక్ చేసేవాడు. కాళ్లు, చేతులు, తల సింక్ లో ఉన్నాయా లేదా అని చూసేవాడు. నచ్చకపోతే మళ్లీ రీ-టేక్ అనేవాడు. అంతలా ఎందుకు పట్టుబట్టాడో ఇప్పుడు అర్థమైంది. ఆ స్టెప్ లో మా సింక్ చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. లక్షల కామెంట్స్ పడుతున్నాయి.”

ఇలా నాటు-నాటు పాట కోసం పడిన కష్టాన్ని బయటపెట్టాడు ఎన్టీఆర్. ఆ ఒక్క స్టెప్ వేయడానికి తనకు చరణ్ కు 12 గంటల సమయం పట్టిందన్నాడు. కీరవాణి ఈ పాటకు సంగీతం అందించగా.. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించాడు.

ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రేక్షకులు ఎన్ని అంచనాలైనా పెట్టుకోవచ్చంటున్నాడు ఎన్టీఆర్. అందరి అంచనాలకు అందనంత ఎత్తులో ఆర్ఆర్ఆర్ మూవీ ఉంటుందని ధీమాగా చెబుతున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఆర్ఆర్ఆర్ సినిమా థియేటర్లలోకి వస్తుంది.