వంద రూపాయలు ఖర్చు.. రూ.33 లక్షలు నష్టం

అవగాహన లేకుండా ఆన్ లైన్ లో ఏదీ చేయకూడదు. పూర్తి అవగాహనతో ఆన్ లైన్ లో ఏదైనా చేయాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని పదే పదే చెబుతున్నప్పటికీ.. కొంతమంది మోసగాళ్లకు అడ్డంగా దొరికిపోతున్నారు. తమ…

అవగాహన లేకుండా ఆన్ లైన్ లో ఏదీ చేయకూడదు. పూర్తి అవగాహనతో ఆన్ లైన్ లో ఏదైనా చేయాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని పదే పదే చెబుతున్నప్పటికీ.. కొంతమంది మోసగాళ్లకు అడ్డంగా దొరికిపోతున్నారు. తమ అజ్ఞానంతో లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఇలానే ఓ మహిళ  అచ్చంగా 33 లక్షల రూపాయలు పోగొట్టుకుంది.

మౌలాలీ ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో తన భర్తను కోల్పోయింది. ఆమెకు 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బులు అందాయి. ఆ డబ్బులతో ముగ్గురు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని భావించిందామె. ఇదిలా ఉండగా.. 8వ తరగతి చదువుతున్న కూతురుకు ఆన్ లైన్ పాఠాల కోసం ఇయర్ ఫోన్స్ కొనాలనుకుందామె.

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో చూడగా రేటు ఎక్కువగా ఉంది. మరో సైట్ లో 99 రూపాయలకే ఖరీదైన ఇయర్ ఫోన్స్ యాడ్ కనిపపించడంతో క్లిక్ చేసింది. చెప్పినట్టుగానే 99 రూపాయలకు హెడ్ ఫోన్ ఇంటికొచ్చింది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ఇయర్ ఫోన్స్ కొన్నందుకు లాటరీలో కారు బహుమతిగా వచ్చిందంటూ ఆమెకు ఫోన్ వచ్చింది. కారు వద్దనుకుంటే, ఆ మొత్తాన్ని ఎకౌంట్ లో వేస్తామని అట్నుంచి చెప్పారు.

తల్లి నిరక్షరాస్యురాలు కాబట్టి 8వ తరగతి చదువుతున్న కూతురికి ఫోన్ ఇచ్చింది. పాపకు కూడా ఆన్ లైన్ లావాదేవీలపై పరిజ్ఞానం లేదు. దీంతో అవతల వ్యక్తి చెప్పినట్టుగానే ఎనీ-డెస్క్ యాప్ డౌన్ లోడ్ చేసుకుంది. ఎకౌంట్ వివరాలన్నీ అందులో ఎంటర్ చేసింది. అంతే.. ఆ రోజు నుంచి ఏకంగా 15 రోజుల పాటు తల్లి ఖాతా నుంచి 33 లక్షల రూపాయలు మాయమయ్యాయి.

ఈ విషయం కుటుంబసభ్యులకు కూడా తెలియదు. ఎందుకంటే, సమాచారం మొత్తం తెలుసుకున్న ఆన్ లైన్ మోసగాళ్లు, బాధిత మహిళ ఖాతా నుంచి ఫోన్ నంబర్లు మార్చేశారు. కొత్త ఫోన్ నంబర్లపై గూగుల్ పే, ఫోన్ పే ఇనస్టాల్ చేసుకొని, బాధిత మహిళ ఖాతా యాడ్ చేసి పలు ఖాతాలకు 33 లక్షల రూపాయలు బదిలీ చేసుకున్నారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న మహిళ, రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.