ఇప్పటికైనా వాస్తవం గ్రహించు చంద్రబాబు!

చంద్రబాబుపై చెప్పులు విసిరిన రైతులు..బాబుపై కర్రలు విసిరిన రాజధాని ప్రజలు..గో బ్యాక్ బాబు అంటూ ఫ్లెక్సీలు, నినాదాలు Advertisement మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజధానిలో ఎదురైన సాదర స్వాగత దృశ్యాలివి. తన…

చంద్రబాబుపై చెప్పులు విసిరిన రైతులు..బాబుపై కర్రలు విసిరిన రాజధాని ప్రజలు..గో బ్యాక్ బాబు అంటూ ఫ్లెక్సీలు, నినాదాలు

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజధానిలో ఎదురైన సాదర స్వాగత దృశ్యాలివి. తన చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన రాజధాని ప్రాంతానికి వస్తుంటే.. జనాలు బ్రహ్మరథం పడతారని బాబు భావించారు. తన చుట్టూ ప్రజలు చేరి సాష్టాంగం పడుతుంటే అంతా చూడాలనే ఉద్దేశంతో జాతీయ మీడియాను కూడా వెంటేసుకొని వచ్చారు. కానీ బాబు ఊహించని విధంగా రాజధాని ప్రాంత వాసుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది.

ఆంధ్రులకు సరికొత్త రాజధానిని ఇచ్చాననే భ్రమల్లో ఉన్నారు చంద్రబాబు. రాజధాని ప్రాంత ప్రజల బతుకులు మార్చేసినట్టు పగటి కలలు కంటున్నారు. ఆ భ్రమలన్నీ ఈరోజుతో పటాపంచలయ్యాయి. తమ జీవితాల్ని ఛిన్నాభిన్నం చేశారంటూ చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు రైతులు. చంద్రబాబు కాన్వాయ్ పైకి కొంతమంది కర్రలు విసిరారు. మరికొంతమంది చెప్పులు కూడా విసిరారు.

ఇక్కడితో ఆగలేదు రైతులు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తాళ్లాయపాలెం మొత్తం బాబు వ్యతిరేక బ్యానర్లతో నిండిపోయింది. నమ్మకద్రోహి బాబు, సిగ్గులేని బాబు, వెన్నుపోటు బాబు.. ఎక్కడ చూసినా ఈ పదాలే కనిపించాయి. కమర్షియల్ ప్లాట్లు ఇస్తానని మోసం చేసిన చంద్రబాబును అంతా తెగ తిట్టుకున్నారు. ఏ మొహం పెట్టుకొని రాజధాని పర్యటనకు వచ్చావంటూ దుమ్మెత్తిపోయారు. బాబు మాత్రం తన స్టయిల్ లో వెకిలిగా నవ్వుతూ, రెండు వేళ్లు ఊపుకుంటూ వెళ్లిపోయారు.

ల్యాండ్ పూలింగ్ పేరు చెప్పి, సీఆర్డీఏ ఏర్పాటుచేసి తమ నుంచి భూములు లాక్కున్నారని, తిరిగి గుర్తుపట్టడానికి వీల్లేకుండా, ఆఘమేఘాల మీద మొత్తం చదునుచేసి పడేశారని, ఇప్పుడు తమ కమర్షియల్ ప్లాట్లు ఎక్కడున్నాయో చూపించాలని చంద్రబాబును డిమాండ్ చేశారు రైతులు. వెంకటపాలెం వద్ద ఏకంగా బాబు కాన్వాయ్ కు రైతులు అడ్డం పడ్డారు.

మొత్తమ్మీద జగన్ ను టార్గెట్ చేయాలనుకున్న చంద్రబాబు రాజధాని పర్యనట, బూమరాంగ్ అయి అతడికే రివర్స్ కొట్టింది. రైతుల నుంచి ఈ స్థాయి నిరసనను చంద్రబాబు ఆశించలేదు. పార్టీ నేతలు తనకు తప్పుడు సమాచారం ఇచ్చారని… తనపై, పార్టీపై ఇంత వ్యతిరేకత ఉందనే విషయం తనకు తెలియదని చంద్రబాబు సహచరులతో వాపోయారు. ఈ దెబ్బతో మరోసారి రాజధాని ప్రాంతంలో పర్యటించే సాహసం చేయరు చంద్రబాబు.