తెలుగుదేశం అధినేత కొన్నాళ్లుగా ఒంగోని దండాలు పెడుతూ ఉన్నారు. ఆ మధ్య ఢిల్లీ వెళ్లి మోడీపై యుద్ధం అంటూ.. పార్లమెంట్ ముందు ఒంగోని మీడియాకు పోజులు ఇచ్చారు. అప్పట్లో మోడీని దించడమే లక్ష్యమంటూ చంద్రబాబు నాయుడు ప్రకటించే వారు కదా.. ఆ సమయంలో అనమాట.
అంతకు ముందు పార్లమెంట్ ముందు మోడీ మోకరిల్లిన సీనే చంద్రబాబుకు గుర్తుకు వచ్చిందే ఏమో కానీ, చంద్రబాబు కూడా అలాంటి పోజు ఒకటి ఇచ్చాడు. మీడియా వైపు చూస్తూ.. చంద్రబాబు నాయుడు ఒంగోని పార్లమెంట్ మెట్లను మొక్కడం ఆయన అనుకూల మీడియాలో మొదటి పేజీల్లో వచ్చింది.
అయితే అలాంటి ఒంగోని పెట్టిన దండం నిష్ఫలం అయ్యింది చంద్రబాబుకు. అప్పట్లో ఢిల్లీ మంత్రాంగం ఏదీ చంద్రబాబుకు కలిసి రాలేదు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వంగింది ఎన్నికల ప్రచార సభల్లో! ఎన్ని సార్లు ఒంగోని దండాలు పెట్టారో లెక్కే లేదు. ప్రతి ఊరికీ వెళ్లడం జగన్ ను తిట్టడం ఎంత కామన్ గా చేశారో, ఒంగోని దండం పెట్టడం కూడా అంతే కామన్ గా చేశారు చంద్రబాబు నాయుడు.
అంత వంగి వంగి దండాలు పెట్టినా చంద్రబాబు నమస్కారాలను జనాలు పట్టించుకోలేదు. ఆయనకు ఇరవై మూడు సీట్లే ఇచ్చారు. కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల సంఖ్యకు సమానంగా సీట్లను ఇచ్చారు. అలా వంగి దండాలు పెట్టడం చంద్రబాబుకు మరోసారి ఫలితాన్ని ఇవ్వలేదు.
అయితే చంద్రబాబు నాయుడు వంగడం మాత్రం ఆపడం లేదు. ఇప్పుడు మళ్లీ అమరావతిలో వంగి దండం పెట్టిన ఫొటోలను ఆయన వర్గం మీడియా హైలెట్ చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు ఇలాంటి ఆషాఢభూతి వేషాలను చాలానే చూపుతూ ఉంటారు. అయితే ప్రజలు వాటిని పట్టించుకోరు. అయినా చంద్రబాబు నాయుడు ఈ ఒంగోని దండాలు పెట్టడం మాత్రం ఇప్పుడు ఆపేలా లేరని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు!