బాబు కొత్త అస్త్రం.. జగన్ పై పనిచేస్తుందా?

మొన్న నితిన్ గడ్కరీ, నిన్న అమిత్ షా.. ఇలా బీజేపీ కీలక నేతల దగ్గరకు ఎంపీలను రాయబారులుగా పంపుతున్నారు చంద్రబాబు. వాస్తవానికి కేంద్ర మంత్రుల్ని రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు కలిస్తే.. అభివృద్ధికి సహకరించాలని మాత్రమే…

మొన్న నితిన్ గడ్కరీ, నిన్న అమిత్ షా.. ఇలా బీజేపీ కీలక నేతల దగ్గరకు ఎంపీలను రాయబారులుగా పంపుతున్నారు చంద్రబాబు. వాస్తవానికి కేంద్ర మంత్రుల్ని రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు కలిస్తే.. అభివృద్ధికి సహకరించాలని మాత్రమే అడగాలి, అంతకు మించి మాట్లాడితే అది విద్వేష రాజకీయమే అవుతుంది. అయితే అమిత్ షాతో భేటీ అయిన టీడీపీ ఎంపీలు రాష్ట్ర రాజకీయాల్ని కూడా తెరపైకి తెచ్చారు.

ఏపీలో గూండా రాజ్యం నడుస్తోందని అమిత్ కు ఫిర్యాదులు చేస్తున్నారు టీడీపీ ఎంపీలు. ఆయనగారు 'ఐ నో' (నాకన్నీ తెలుసు) అన్నట్టు తెల్లారి అనుకూల మీడియాలో ఆర్టికల్స్ పడ్డాయి. అసలింతకీ టీడీపీ ఎంపీలు కేంద్రంలో చేస్తున్నదేంటి. రాష్ట్ర అభివృద్ధి కోసం వెళ్తున్నారా లేక, ఏపీలో వైసీపీని ఎదుర్కోడానికి మాకు మీ మద్దతు కావాలని అభ్యర్థించడానికి వెళ్తున్నారా. చంద్రబాబు అజెండా మాత్రం రెండోదే.

ఏపీలో వైసీపీని ఎదుర్కోడానికి బీజేపీ మద్దతు కోరుతున్నారు చంద్రబాబు. అందుకే కొన్నిరోజులుగా ఆ పార్టీపై విమర్శలు తగ్గించేశారు. నాలుగు రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ బీజేపీకి టీడీపీ దగ్గరవుతుందనే స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం వైసీపీ విధానాలపై, జగన్ నిర్ణయాలపై అటు టీడీపీ, ఇటు బీజేపీ విడివిడిగా పోరాటాలు చేస్తున్నాయి. విద్యుత్ సంస్థలతో ఒప్పందాల రద్దు తదితర విధాన నిర్ణయాలతో జగన్ బీజేపీకి కంటగింపుగానే మారారు.

ఈ నేపథ్యంలో కేంద్రంతో దోస్తీ చేసి, జగన్ ని ఇరుకున పెట్టాలని, ఇబ్బంది పెట్టాలని చూస్తోంది టీడీపీ. కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో కోతలు పెట్టి, పరోక్షంగా జగన్ ని ముద్దాయిని చేసేలా పావులు కదుపుతోంది. రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నవారే బీజేపీకి శత్రువులు, మిగతావారంతా మిత్రులే, అందుకే ఆ పార్టీ కూడా టీడీపీతో అంటకాగడానికి ఏమాత్రం మొహమాట పడటం లేదు.

శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు.. ఇప్పుడు అందరూ కలసిపోయారు. జగన్ ని ఒంటరిని చేసి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. అందుకే ఢిల్లీలో తన ఎంపీలతో చంద్రబాబు రాయబేరాలు మొదలు పెట్టారు.