పాపం బాబు…భ్ర‌మ‌ల‌న్నీ చెదిరిపాయె!

మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఎప్పుడూ తాను భ్ర‌మ‌ల్లో వుంటూ, జ‌నాన్ని అదే రీతిలో ఉండేలా చేయాల‌ని ఆలోచిస్తుంటారు. వ్య‌వ‌స్థ‌ల్నే కాదు, జనాన్ని కూడా మేనేజ్ చేయ‌గ‌ల‌న‌నే న‌మ్మ‌కం, విశ్వాసం చంద్ర‌బాబులో ఎక్కువ‌. ఎందుకంటే వ్య‌వ‌స్థ‌ల్ని…

మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఎప్పుడూ తాను భ్ర‌మ‌ల్లో వుంటూ, జ‌నాన్ని అదే రీతిలో ఉండేలా చేయాల‌ని ఆలోచిస్తుంటారు. వ్య‌వ‌స్థ‌ల్నే కాదు, జనాన్ని కూడా మేనేజ్ చేయ‌గ‌ల‌న‌నే న‌మ్మ‌కం, విశ్వాసం చంద్ర‌బాబులో ఎక్కువ‌. ఎందుకంటే వ్య‌వ‌స్థ‌ల్ని మేనేజ్ చేయ‌డంలో స‌క్సెస్ కావ‌డంతో, ఆయ‌న ఇక వెను తిర‌గ చూడ‌లేదు. దివంగ‌త ఎన్టీఆర్ మొట్ట‌మొద‌ట నాదెండ్ల భాస్క‌ర్‌రావు చేతిలో వెన్నుపోటుకు గురైన‌ప్పుడు జ‌నం నుంచి పెద్ద ఎత్తున తిరుగుబాటు వ‌చ్చింది.

దీంతో నాదెండ్ల భాస్క‌ర్‌రావు అధికారం మూణ్ణాళ్ల ముచ్చ‌టైంది. ఇదే అల్లుడైన చంద్ర‌బాబు 1995లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారు. కానీ అప్పుడు ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న రాలేదు. అలాగే ఆ త‌ర్వాత ఎన్నిక‌ల్లో వాజ్‌పేయ్ పుణ్య‌మా అని 1999లో చంద్ర‌బాబు మ‌ళ్లీ అధికారాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో ఎన్టీఆర్ లాంటి ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన నాయ‌కుడినే వెన్నుపోటు పొడిచి, క‌నీస ప్ర‌జా వ్య‌తిరేక‌త రాకుండా చూసుకోగ‌లిగాన‌నే గ‌ర్వం, ఆత్మ విశ్వాసం బాబులో ఏక కాలంలో క‌లిగాయి.

దీంతో ఎవ‌రినైనా, ఏ వ్య‌వ‌స్థ‌నైనా మేనేజ్ చేయ‌గ‌ల‌న‌న్న న‌మ్మ‌కం చంద్ర‌బాబులో అప్ప‌టి నుంచి క్ర‌మంగా పెరుగుతూ వ‌చ్చాయి. తాజాగా నంద్యాల‌లో అరెస్ట్ చేసిన హెలీకాప్ట‌ర్‌లో త‌ర‌లిస్తామ‌ని చంద్ర‌బాబుతో పోలీస్ ఉన్న‌తాధికారులు చెప్పారు. ఇందుకు ఆయ‌న అంగీక‌రించ‌లేదు. వాహ‌నంలోనే త‌ర‌లించాల‌ని కోరారు. దీని వెనుక ఆయ‌న రాజ‌కీయ ఎత్తుగ‌డ లేక‌పోలేదు. విజ‌య‌వాడ‌కు త‌ర‌లించాలంటే క‌నీసం ఐదారు గంట‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని, దారి పొడ‌వునా త‌న అరెస్ట్‌కు వ్య‌తిరేకంగా జ‌నం పెద్ద ఎత్తున రోడ్ల మీద‌కు వ‌చ్చి ఎక్క‌డిక‌క్క‌డ అడ్డుకుంటార‌ని బాబు ఊహించారు.

అయితే చంద్ర‌బాబు ఊహించిన‌ట్టు జ‌ర‌గ‌లేదు. అక్క‌డ‌క్క‌డ టీడీపీ కార్య‌క‌ర్త‌లు రోడ్డు మీదకి వ‌చ్చి హడావుడి చేయగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త‌న‌ను అరెస్ట్ చేస్తే భూమి త‌ల‌కిందుల‌వుతుంద‌ని భావించిన చంద్ర‌బాబు, అలాంటిది జ‌ర‌గ‌క‌పోవ‌డంతో తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు. ప్ర‌జ‌లు రోడ్డు మీద‌కి వ‌స్తార‌నే భ్ర‌మ‌లు తాజా ఎపిసోడ్‌తో తేలిపోయింది.