దేశంలోనే సీనియర్ నాయకుడైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అవినీతి కేసులో అరెస్ట్ చేయగా, జాతీయ స్థాయిలో ఏ ఒక్కరూ స్పందించలేదు. ఒకప్పుడు ఎన్డీఏ కన్వీనర్‌గా కూడా చంద్రబాబు పనిచేశారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాని మోదీని గద్దె దింపుతానంటూ దేశ వ్యాప్తంగా చంద్రబాబు విస్తృతంగా పర్యటించారు.
ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని పొందడం, జాతీయ స్థాయిలో మరోసారి మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో చంద్రబాబులో భయం మొదలైంది. అప్పటి నుంచి మోదీ సర్కార్‌కు చంద్రబాబు సాగిల పడ్డారనే విమర్శ లేకపోలేదు. నాడు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి పరూక్ అబ్దుల్లా తదితర నేతలతో చంద్రబాబు చెట్టపట్టాలేసుకుని తిరిగారు.
మోదీపై దారుణ విమర్శలు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని, అందులో తాను కీలక పాత్ర పోషిస్తానని చంద్రబాబు ఎంతో నమ్మకంగా ఉండేవారు. అయితే ఆయన అంచనాలన్నీ తలకిందులయ్యాయి. దీంతో తత్వం బోధపడి అంత వరకూ కలిసి పని చేసిన వాళ్లకు దూరం జరిగాయి. కనీసం జాతీయ నాయకులు ఫోన్ చేసినా, భయంతో మాట్లాడలేని దయనీయ స్థితికి చంద్రబాబు దిగజారారని వారంతా గ్రహించారు.
ఇటీవల జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఏర్పాటైంది. చంద్రబాబు రెండు కూటములకు దూరంగా ఉన్నారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు కష్టకాలంలో వుంటే రెండు కూటములు పట్టించుకోలేదు. కనీసం సహచర తెలుగు రాష్ట్రమైన తెలంగాణ నుంచి చంద్రబాబు అరెస్ట్‌పై స్పందన లేదు.
ఒకప్పుడు ప్రధానులు, రాష్ట్రపతులు, లోక్‌సభ స్పీకర్లను తానే పెట్టానని చంద్రబాబు చెప్పుకోడాన్ని చూశాం. అలాంటి నాయకుడికి జాతీయ స్థాయిలో ఇప్పుడున్న విలువ ఏంటో అర్థమైంది. చంద్రబాబు కేవలం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితమైన నాయకుడని జాతీయ నాయకుల స్పందనా రాహిత్యం ద్వారా తెలిసొస్తోంది. చంద్రబాబు రాజకీయంగా ఒంటరి అయ్యారు. బాబు కష్టనష్టాలను, ఇబ్బందులను ఇతరులు పట్టించుకునే పరిస్థితి లేదని తాజా ఎపిసోడ్‌తో నిరూపితమైంది.