చంద్రబాబునాయుడి అరెస్ట్ ఆయన కన్న కొడుకు కంటే దత్త పుత్రుడికే ఎక్కువ బాధ కలిగించినట్టుంది. బాబు అరెస్ట్‌ను నిరసిస్తూ పవన్‌కల్యాణ్ చేసిన యాగీ అంతాఇంతా కాదు. చంద్రబాబునాయుడి అరెస్ట్ వార్త తెలియగానే ఉభయ గోదావరి జిల్లాల్లో పాదయాత్ర చేస్తున్న లోకేశ్ రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. మౌనంగా ఆయన రోడ్డు మీద కూచున్నారు. బాబును పరామర్శించడానికి వెళ్లేందుకు లోకేశ్ సిద్ధమవుతుండగా పోలీసులు అడ్డుకోవడంతో ఫైర్ అయ్యారు. అంతకు మించి లోకేశ్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు.
వైసీపీ ముద్దుగా పిలుచుకునే దత్త పుత్రుడు పవన్‌కల్యాణ్ ఓవరాక్షన్ చూస్తే… ఇంతకూ ఈయన జనసేనానా? లేక టీడీపీ నాయకుడా? అనే అనుమానం ప్రతి ఒక్కరిలో కలిగింది. బాబు అరెస్ట్‌తో టీడీపీ నాయకులు భయపడి పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చి చాలా మంది అరెస్ట్ అయ్యారు. మరికొందరు ఇళ్లలోనే వుండి నిరసన తెలిపారు. బాబు అరెస్ట్‌ను నిరసిస్తూ పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేసిన దాఖలాలు చాలా తక్కువనే చెప్పాలి.
కానీ పవన్‌కల్యాణ్ మాత్రం చంద్రబాబును చూసేందుకు పరితపించారు. ప్రత్యేక విమానంలో వచ్చేందుకు సిద్ధమై, గన్నవరంలో అనుమతి నిరాకరించడంతో గాలిలో ప్రయాణం విరమించారు. ఎలాగైనా బాబును చూడాలనే కోరిక ఆయన్ను కుదురుగా ఉండనివ్వలేదు. రోడ్డు మార్గాన విజయవాడకు బయల్దేరారు. పెద్దసంఖ్యలో అభిమానులు, జనసేన కార్యకర్తలు వెంటరాగా బలప్రదర్శన చేస్తుండడంతో ఎన్టీఆర్ జిల్లా అనుమంచిపల్లి సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో పవన్‌కల్యాణ్ కారు దిగి రోడ్డుపై బైఠాయించారు. రోడ్డుపై పడుకుని సినిమాను తలపించేలా నిరసన ప్రదర్శించారు. ఇలా అడుగడుగునా పవన్‌కల్యాణ్ అతి మామూలుగా లేదు. చంద్రబాబు అరెస్ట్‌తో పవన్‌కల్యాణ్ హర్ట్ అయిన అభిప్రాయం ఆయన ప్రవర్తన చూసిన వాళ్లకు కలుగుతుంది. అబ్బో కన్న కొడుకు కంటే దత్త పుత్రుడికే బాబుపై ప్రేమ కాస్త ఎక్కువ వున్నట్టుందనే కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.