అమరావతి రైతుల పోరాటం మీద తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కాకపోయినప్పటికీ.. ఒక వర్గంలో సానుభూతి ఉంది. వారు తెలుగుదేశం తైనాతీల్లాగా తెలుగుదేశం స్కెచ్ ప్రకారం పోరాడడం లేదని, తాము రాజధానికి భూములు ఇచ్చాం గనుక.. అక్కడ రాజధాని వచ్చి తీరాల్సిందేననే ఏకైక డిమాడ్ తోనే పోరాడుతున్నారని భ్రమపడుతున్న వారు ఉన్నారు.
తెలుగుదేశం చేతుల్లో అమరావతి పోరాటం కీలుబొమ్మ వంటిదని వారు నిన్నటిదాకా అనుకోవడం లేదు. అలాంటి వారికి ఇవాళ కళ్లు తెరచుకున్నాయి. అమరావతి రైతులు బాధితుల్లాగా పోరాడడం లేదని.. జగన్మోహన్ రెడ్డిని శత్రువులాగా ఎంచి పోరాడుతున్నారని ఇవాళ అర్థమైంది. కొన్ని గంటల వ్యవధిలోనే తమ నిజస్వరూపం ఏమిటో వారు చూపించారు.
సోమవారం నాడు ప్రభుత్వం సీఆర్డీయే రద్దు బిల్లును, మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటున్నట్టు అడ్వకేట్ జనరల్ హైకోర్టులో నివేదించిన సంగతి తెలిసిందే. కేబినెట్ కూడా ఆ మేరకు తీర్మానించినట్లు ముందే బయటకు వచ్చింది. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధి తర్వాత.. జగన్మోహన్ రెడ్డి శాసనసభలో కీలక ప్రకటన చేశారు.
అయితే ఈ మాత్రం వ్యవధిని కూడా రైతులు, ఆరూపంలోని తెలుగుదేశం కార్యకర్తలు ఆగలేకపోయారు. మూడురాజధానుల బిల్లు రద్దు అనే ప్రకటన రాగానే వారు పండగ చేసేసుకున్నారు. అంతవరకూ పరవాలేదు. ఆ సమయానికి ఆనందం కలుగుతుందనే అనుకోవచ్చు. అయితే.. ఆ బిల్లు రద్దు నిర్ణయాన్ని రైతుల పోరాటం సాధించిన విజయంగా అభివర్ణించారు. అది కూడా సరే- అనుకోవచ్చు. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులకు క్షమాపణ చెప్పాల్సిందేనంటూ.. వారు డిమాండ్ చేశారు.
ఇదే కాస్త అతి అనిపించుకుంది. ఒకవేళ కొత్త బిల్లు గురించిన ప్రకటన రాకముందు- మూడు రాజధానుల రద్దు అనే మాట వినిపించగానే.. ఆ సంబరాల్లో రైతులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు అభినందనలు చెప్పి ఉంటే ఇంకోలా ఉండేది. తమ గోడు అర్థం చేసుకున్నందుకు థాంక్స్ చెప్పి ఉంటే బాగుండేది. నిజమైన పోరాటం చేసిన వారైతే అలాగే చెప్పి ఉంటారు.
ఏ ప్రభుత్వం- ఏ పోరాటాలకు అనుకూల నిర్ణయం తీసుకున్నా పోరాడిన వారి స్పందన అలాగే ఉంటుంది. కానీ.. అమరావతి పోరాటంలో ఉన్నవారంతా చంద్రబాబు తైనాతీలు, తెలుగుదేశం పార్టీ కిరాయి ఉద్యమకారులు అనే ముద్ర ఉన్నవారు గనుక.. బిల్లు రద్దు అనే మాట చెవిన పడగానే.. జగన్ క్షమాపణ చెప్పాలంటూ ఎగస్ట్రా డైలాగులు వల్లించారు.
పాపం.. వారికి ఆ ఎగస్ట్రా దూకుడు, ఎగస్ట్రా జోష్ కొన్ని గంటలు కూడా నిలవలేదు. అన్ని ప్రాంతాల అభివృద్ధి మాత్రమే తమ ధ్యేయమని.. సమగ్రమైన బిల్లను మరొకటి రూపొందించి సభ ముందుకు తెస్తామని జగన్ ప్రకటించడంతో వారి నోర్లు మూతపడ్డాయి. హతాశులయ్యారు.