ఒవైసీ- బీజేపీతో కుమ్మక్కయ్యాడంటే అనరా మరి..!

హైదరాబాదులో తిరుగులేకుండా ప్రతిసారీ గెలుస్తూ ఉండే ఎంపీ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ఆయన ఇప్పుడు ఓ సంచలన ప్రకటన చేశారు. 403 ఎమ్మెల్యే సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్ లో తమ పార్టీ ఈ…

హైదరాబాదులో తిరుగులేకుండా ప్రతిసారీ గెలుస్తూ ఉండే ఎంపీ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ఆయన ఇప్పుడు ఓ సంచలన ప్రకటన చేశారు. 403 ఎమ్మెల్యే సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్ లో తమ పార్టీ ఈ దఫా 100 స్థానాల్లో బరిలోకి దిగుతుందని అన్నారు. ఖచ్చితంగా విజయం సాధిస్తామని కూడా అన్నారు. 

ముస్లింల ఓటు మాత్రమే ఆశిస్తూ బరిలోకి దిగే పార్టీ- మజ్లిస్. ముస్లిం ఓటు బ్యాంకు గణనీయంగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఈ నేపథ్యంలో అక్కడి ఎన్నికల్లో ఖచ్చితంగా వీరి ప్రభావం ఉంటుంది. అయితే.. గత అనుభవాలను గమనించినప్పుడు.. అసదుద్దీన్ ఒవైసీ అడుగులు, ఇతర ప్రాంతాల్లో పోటీచేసే వ్యవహారాలు అన్నీ కూడా బీజేపీకి మేలు చేకూర్చడానికే జరుగుతోందన్న ఆరోపణలు పుష్కలంగా ఉన్నాయి. 

గతంలో గుజరాత్ ఎన్నికల్లో పోటీచేసినా, మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీచేసినా.. ఇతర ప్రాంతాల్లో బరిలోకి దిగి తొడకొట్టినా.. మజ్లిస్ పార్టీ పోటీ వలన బీజేపీకి మాత్రమే అంతిమ ప్రయోజనం కలిగిందనే అభిప్రాయాలు సర్వత్రా ఉన్నాయి. ముస్లింలను ఖచ్చితంగా ప్రభావితం చేయగలిగే నేతగా అసదుద్దీన్ ఒవైసీ ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును, బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చడానికి ఉపయోగపడుతున్నారే తప్ప.. వారిని ఓడించడానికి కాదనే విమర్శలున్నాయి. దానికి తగ్గట్టుగానే ప్రస్తుత ప్రకటన కూడా ఉంది. 

ఈసారి యూపీ అసెంబ్లీ ఎన్నికలు మాంచి కాకపుట్టిస్తున్నాయి. మోడీ దళంలో వణకు మొదలైంది. రెండు రోజుల కిందట నరేంద్రమోడీ.. మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడం కూడా యూపీ ఎన్నికల నేపథ్యంలోనే అనే విమర్శలున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఒవైసీ హఠాత్తుగా తెరపైకి వచ్చారు. ఏకంగా వంద స్థానాల్లో పోటీకి దిగుతాం అని వెల్లడించారు. 

నిజానికి యూపీలో బలంగా ఉన్న భాజపాయేతర పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా ఎన్నికల్లో ఒవైసీ పోటీచేస్తే గనుక.. ఖచ్చితంగా బీజేపీకి లాభం జరుగుతుంది. నల్లేరుపై బండినడక లాగా.. చాలా సునాయాసంగా బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుది. గత అనుభవాలు ఇదే చెబుతున్నాయి. ఒవైసీ అక్కడ మాయావతి సారథ్యంలోని బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నించారు కానీ కుదర్లేదు. అలా అనడం కంటె ఒవైసీని వారు నమ్మలేదు అంటే బాగుంటుందని కొందరి వ్యాఖ్య.

ప్రస్తుతానికి పొత్తుల సంగతి ఒవైసీ ఏం తేల్చలేదు. అఖిలేష్ సారథ్యంలోని ఎస్పీతో పొత్తు పెట్టుకుంటే మాత్రం బీజేపీకి చిక్కులే. కానీ.. ఆయన ఆశిస్తున్నట్టుగా వంద సీట్లు అఖిలేష్ కేటాయించడం అనేది అసాధ్యం. ఒవైసీ సీట్ల విషయంలో రాజీపడకపోతే.. మళ్లీ బీజేపీ నోట్లో పాలుపోసినట్టే అవుతుంది. సీట్ల విషయంలో ఆయన తెగేదాకా లాగుతారనే వాదన కూడా ఉంది. 

అందుకే- ఒవైసీ విషయంలో ఆయన ప్రతి అడుగూ బీజేపీతో కుమ్మక్కు అయ్యే వేస్తుంటారంటే.. ఇలాంటి పరిణామాలు చూసి నమ్మాల్సిందే అని ప్రజలు అనుకుంటున్నారు.