మహారాష్ట్ర.. కొత్త కూటమి డీల్ ఇదే!

ముఖ్యమంత్రి పదవిని అమితంగా ఆకాంక్షించిన శివసేనకే ఆ పదవి. కూటమిలో రెండో పెద్ద పార్టీ అయిన ఎన్సీపీకి ఉపముఖ్యమంత్రి పదవి. ప్రభుత్వ ఏర్పాటులో కీలకం అయిన కాంగ్రెస్ కు స్పీకర్ పదవి.. ఇదీ ఈ…

ముఖ్యమంత్రి పదవిని అమితంగా ఆకాంక్షించిన శివసేనకే ఆ పదవి. కూటమిలో రెండో పెద్ద పార్టీ అయిన ఎన్సీపీకి ఉపముఖ్యమంత్రి పదవి. ప్రభుత్వ ఏర్పాటులో కీలకం అయిన కాంగ్రెస్ కు స్పీకర్ పదవి.. ఇదీ ఈ చిత్రవిచిత్ర కూటమిలో పదవుల పంపకం. 

ముందుగా జరిగిన ప్రచారం ప్రకారం..కాంగ్రెస్, ఎన్సీపీలకు చెరో ఉపముఖ్యమంత్రి పదవి దక్కాల్సింది. అయితే ఆ విషయంలో కాంగ్రెస్ వెనక్కు తగ్గినట్టుగా తెలుస్తోంది. ఈ కూటమి ఏర్పాటు విషయంలో  ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, అహ్మద్ పటేల్ చర్చల్లో పాల్గొని ఒక ఒప్పందానికి వచ్చారట. 

ఇక మంత్రి పదవుల విషయంలో.. శివసేనకు సీఎం పదవితో కలిపి పదిహేను మంత్రి పదవులు, ఎన్సీపీకి ఉపముఖ్యమంత్రి పదవితో సహా పదిహేను పదవులు, కాంగ్రెస్ పార్టీకి స్పీకర్ కాకుండా పదమూడు మంత్రి పదవులు దక్కనున్నాయట. 

మామూలుగా అయితే పదవుల విషయంలో ఈ కూటమిలో కూడా పేచీలు వచ్చేవో  ఏమో. అయితే భారతీయ జనతా పార్టీ ముందుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, బలనిరూపణలో భంగపడి రాజీనామాలతో తప్పుకోవడంతో..ఈ పార్టీల మధ్యన ఐక్యత మరింత పెరిగింది. పదవుల విషయంలో కాస్త అటూఇటూ అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికే ప్రథమ ప్రాధాన్యతను ఇచ్చాయి. 

మరి కాషాయ పార్టీతో కాంగ్రెస్ పార్టీల కూటమి ఇది. దీని మనుగడ ఎన్నాళ్లో, దీని పాలన ఎలా సాగుతుందో. శివసేన మాత్రం తన డ్రీమ్ ప్రాజెక్టును పట్టాలెక్కించింది.