గత శనివారం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్ పవార్ ఈ రోజు ఎన్సీపీ తరఫున మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడట! తమ కోటాకు దక్కే ఉపముఖ్యమంత్రి పదవిని అజిత్ పవార్ కే ఇవ్వాలని ఫిక్సయ్యిందట ఎన్సీపీ! పార్టీ తిరుగుబాటు నేతగా బీజేపీతో చేతులు కలిపిన అజిత్ పవార్ ను ఎన్సీపీ లెజిస్లేటివ్ నేతగా తొలగిస్తున్నట్టుగా ఆ పార్టీ అధినేత శరద్ పవార్ రెండు రోజుల కిందట ప్రకటించారు.
అయితే ఇప్పుడు ఆయనను మళ్లీ లెజిస్లేటివ్ విభాగానికి అధ్యక్షుడిగా ఎన్నుకోనున్నట్టుగా పవార్ ప్రకటించారట. అలాగే ఉపముఖ్యమంత్రి పదవిని ఆయనకే కట్టబెట్టనున్నట్టుగా తెలుస్తోంది.
మొత్తానికి అజిత్ పవార్ ది జాక్ పాట్ అనుకోవాలో, లేక శరద్ పవార్ బంధుప్రీతికి హద్దు లేదని చెప్పాలో కానీ..ఐదు రోజుల వ్యవధిలో రెండోసారి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నాడట అజిత్ పవార్. అది కూడా వేర్వేరు కూటముల తరఫున ఆయన ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు.
తమకు తిరుగుబాటు చేసినంత పని చేసి, వెంట ఎమ్మెల్యేలను తీసుకువెళ్లలేక భంగపడ్డా అజిత్ పవార్ కు శరద్ పవార్ ఫ్యామిలీ చాలా విలువను ఇస్తోంది.శాసనసభలో కూడా అజిత్ పవార్ కు సుప్రియా సూలే ఆప్యాయంగా స్వాగతం పలికారు. ఈ మహారాష్ట్ర ఫ్యామిలీ పాలిటిక్స్ చాలా ఆప్యాయతలతోనే నిండినట్టుగా ఉన్నాయి!