తన సినిమా విడుదలకు కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తున్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' పేరుతో రూపొందిస్తున్న సినిమా విడుదల జరుగుతుందా? అనే అనుమానాలున్నాయి. అందుకు మొదటి కారణం టైటిలే. ఈ విషయంలో కోర్టు కానీ, సెన్సార్ బోర్డు కానీ అభ్యంతరం చెప్పే అవకాశాలు లేకపోలేదు.
ఇప్పటికే ఈ విషయంలో కోర్టులో పిటిషన్లు కూడా దాఖలు అయ్యాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు ఆర్జీవీ స్పందించారు. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా పూర్తిగా కల్పితం అన్నాడు. జరిగిన, జరగబోయే సంఘటనలను తమ సినిమా అని అంటున్నాడు. భవిష్యత్తులో జరగబోతాయి.. అనే ఊహాజనిత సంఘటనలతో రూపొందిన సినిమా అని అంటున్నాడు ఆర్జీవీ.
ఆ సినిమాలోని సీన్లకు, పాత్రలకూ, వాస్తవంతో ఏవైనా పొంతన వస్తే అది పూర్తిగా యాదృచ్చికమే అని తన దైన స్టైల్లో చెబుతున్నాడు వర్మ. అలా ఎన్ని రకాలుగా కప్పిపుచ్చినా టైటిల్ దగ్గర మాత్రం వర్మ దొరికిపోతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆ విషయంలోనూ వర్మ ప్లాన్ బీ రెడీ చేశాడట.
ఒకవేళ ఈ సినిమా టైటిల్ ను మార్చాల్సి వస్తే ..దానికి 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' అంటూ టైటిల్ పెడతాడట. ఇది వరకూ కూడా వర్మ తీసిన పలు సినిమాలకు టైటిల్స్ మార్చాల్సి వచ్చింది. అయితే అనుకున్న టైటిల్ తో ప్రచారం వచ్చాకా.. ఆఖరి నిమిషంలో టైటిల్ మార్చినా వీళ్లకు పెద్దగా నష్టం ఉండదు. రావాల్సిన ప్రచారం వచ్చేసి ఉంటుంది కదా!