ఏడాది కిందటి వరకూ దేశంలో 70 శాతం రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పాలన సాగుతూ ఉండేది. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఆ ఉత్సాహం రాష్ట్రాల్లో మాత్రం ఉరకలు వేయడం లేదు. హర్యానా, మహారాష్ట్రల్లో భారతీయ జనతా పార్టీ బోటాబోటీ సీట్లను సాధించుకుంది. హర్యానాలో మాత్రం ఏదోలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. మహారాష్ట్రలో బీజేపీ పప్పులు ఉడకలేదు.
ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ పాలనలో ఉన్న ప్రాంతం నలభై శాతానికి పడిపోయిందని గణాంకాలు చెబుతూ ఉన్నాయి! దేశమంతా కాషాయమయమని, కాంగ్రెస్ ముక్త భారత్ అని.. బీజేపీ వాళ్లు నినాదాలు చేశారు. అయితే ఇప్పుడు నలభై శాతంలో మాత్రమే బీజేపీ పాలన అని గ్రాఫులు చూపుతున్నాయి.
ఆ సంగతలా ఉంటే.. భారతీయ జనతా పార్టీకి మరో రాష్ట్రంలో డేంజర్ బెల్స్ మోగుతూ ఉన్నాయి. అది కర్ణాటకలో. అక్కడ ఉప ఎన్నికల ప్రచారం హోరెత్తుతూ ఉంది. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ లు త్రిముఖ పోరులో తలపడుతూ ఉన్నాయి. విజయం కోసం ఆయా పార్టీల నేతలు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నాయి.
ఈ పరిస్థితుల్లో అక్కడ భారతీయ జనతా పార్టీ అక్కడ నాలుగైదు అసెంబ్లీ సీట్లకు మించి నెగ్గే అవకాశాలు లేవనే ప్రచారం సాగుతూ ఉండటం గమనార్హం. మొత్తం 15 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి.
అవన్నీ కాంగ్రెస్-జేడీఎస్ సీట్లు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొన్న ఎన్నికల్లోనే ఆ సీట్లలో నెగ్గింది. గెలిచిన ఎమ్మెల్యేలు ఫిరాయించారు. వారికే ఇప్పుడు బీజేపీ టికెట్లు ఇచ్చింది. వాటిల్లో కాంగ్రెస్ కు సహజంగా ఉన్న బలం, ఆపై ఫిరాయింపుదారులపై ప్రజల్లో వ్యతిరేకత ఎదురైతే.. బీజేపీకి ముప్పుతిప్పలు తప్పకపోవచ్చని పరిశీలకులు అంచనా వేస్తూ ఉన్నారు.
ఇవన్నీ గాక.. కాంగ్రెస్ నుంచి ఫిరాయించి వచ్చిన ఎమ్మెల్యేలపై భారతీయ జనతా పార్టీ పాత కాపుల్లో వ్యతిరేకత ఉంది. కొన్ని చోట్ల రెబల్స్ కూడా సత్తా చూపేలా ఉన్నారు. ఇన్నేళ్లూ తమ వ్యతిరేక నేతలకు బీజేపీ వాళ్లు ఇప్పుడు ఏ మేరకు సహకారం అందిస్తారనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది.
ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఉప ఎన్నికలు జరుగుతున్న వాటిల్లో మూడో వంతు సీట్లను కూడా బీజేపీ నెగ్గగలదనే ధీమా కనిపించడం లేదట. అదే జరిగితే.. యడ్యూరప్ప ప్రభుత్వం మైనారిటీలో పడే అవకాశాలున్నాయి. అయితే మళ్లీ ఫిరాయింపులు చేయించి.. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం బీజేపీకి చిటికెలో పని కావొచ్చు!