ఫ్యామిలీ సినిమాల దర్శకుడి సెక్సీ కామెంట్ల దుమారం!

భాగ్యరాజ్…తమిళ ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్. తమిళుడనే మాటే కానీ, భాగ్య రాజ్ రూపొందించిన దాదాపు అన్ని సినిమాలూ తెలుగు ప్రేక్షకులను డబ్బింగ్, రీమేక్ ల రూపంలో పలకరించాయి. తెలుగునాట కూడా భాగ్యరాజ్ సినిమాలు ప్రత్యేకంగా…

భాగ్యరాజ్…తమిళ ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్. తమిళుడనే మాటే కానీ, భాగ్య రాజ్ రూపొందించిన దాదాపు అన్ని సినిమాలూ తెలుగు ప్రేక్షకులను డబ్బింగ్, రీమేక్ ల రూపంలో పలకరించాయి. తెలుగునాట కూడా భాగ్యరాజ్ సినిమాలు ప్రత్యేకంగా నిలిచాయి. తెలుగునాట స్టార్ డైరెక్టర్లు కూడా భాగ్యరాజ్ తమిళ సినిమాలను రీమేక్ చేసి ప్రేక్షకులకు అందించారు. 

'ఎర్రగులాబీలు' వంటి సినిమాకు కథను అందించిన భాగ్యరాజ్ ఆ తర్వాత నటుడిగా, దర్శకుడిగా ఒక దిగ్గజ స్థాయికి ఎదిగాడు. సినిమా హీరోయినే అయిన పూర్ణిమను పెళ్లి చేసుకుని.. ఆ రకంగా కూడా మంచి మార్కులే పొందాడు. 'అబ్బాయిగారు', 'చిన్న వీడు', 'సుందరకాండ', 'అమ్మాయిలూ ప్రేమించండి', 'డార్లింగ్ డార్లింగ్', 'మూడుముళ్లు' వంటి ప్యూర్ ఫ్యామిలీ టైప్ సినిమాలతో తమిళ, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు భాగ్యరాజ్.
 
అయితే ఇప్పుడు ఆయన చేసిన సెక్సీ కామెంట్స్ దుమారం రేపుతూ ఉన్నాయి. పత్రికల్లో వార్తలను చూసే ఈ నటదర్శకుడు అలా స్పందించినట్టుగా ఉన్నాడు. అయితే అక్రమ సంబంధాల్లో జరిగే నేరాలన్నింటికీ మహిళలే కారణమని భాగ్యరాజ్ తేల్చడం విడ్డూరంగా మారింది.

ఈ మధ్య కాలంలో కొందరు స్త్రీలు అక్రమ సంబంధ వ్యవహారాల్లో భర్తను, పిల్లలను చంపిన ఉదంతాలు కొన్ని వార్తల్లోకి వచ్చాయి. వాటిని పట్టుకుని అక్రమ సంబంధాల్లో నేరాలకు  కారణం మహిళలే అని ఈ సినీ దిగ్గజం తేల్చాడు. అయితే ఒంటి చేతి చప్పట్లు ఎక్కడా మోగవు. మహిళలు అలాంటి నేరాలు చేసి ఉండొచ్చుగాక, అయితే వాటిల్లో ఆ అక్రమ సంబంధంలో భాగమైన పురుషుడి సహకారం? ప్రోద్బలం లేకుండానే అవన్నీ జరిగాయంటే మాత్రం నమ్మలేం. 

అలా అక్రమ సంబంధ నేరాలకు మహిళలే కారణమని, మగాడు చిన్నింటిని మెయింటెయిన్ చేసినా భార్యా-పిల్లలకు అన్నీ సమకూరుస్తాడని భాగ్యరాజ్ వ్యాఖ్యానించాడు. మగాడు అక్రమ సంబంధం పెట్టుకోవడం రైటు, ఆడవాళ్లు మాత్రం తప్పు అని ఈ నటుడు తేల్చాడు. అయితే మగాడు అక్రమ సంబంధం పెట్టుకోవాలన్నా.. ఆడవాళ్ల సహకారం కావాల్సిందే కదా! 

దీనికీ భాగ్యరాజ్ ఒక లాజిక్ చెప్పాడు. అదేమిటంటే..'సూది  సందు ఇవ్వకపోతే అందులోకి దారం దూరలేదు..' అంటూ ఒక తమిళ మోటు సామెతను ఉదాహరించాడు. అలాగే అమ్మాయిలకు తల్లిదండ్రులు సెల్ ఫోన్ తీయిస్తే, వాళ్లు చాటింగ్ చేస్తూ ఉన్నారంటూ.. ఈ తరం అమ్మాయిలకూ ఈ దర్శకుడు సర్టిఫికేషన్ ఇచ్చాడు.

ఒక సినిమా ఆడియో విడుదల వేడుకలో ఈ నటదర్శకుడు ఈ వ్యాఖ్యానం చేశారు. అక్కడున్న వారు అయితే ఈ ప్రసంగంపై చప్పట్లు కొట్టారు కానీ, మిగతా మహిళా వాదులు, స్త్రీ హక్కు సంఘాల వాళ్లు ఆయనపై కారాలూ మిరాయాలూ నూరుతున్నారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తమిళ సినిమా వాళ్లకు కొత్తకాదు. ఆ మధ్య నయనతార పై అనుచితంగా మాట్లాడి రాధారవి వివాదం రేపాడు, ఆపై తమిళ సినీ గేయ రచయిత, ప్రసిద్ధ వైరముత్తు కూడా మీ టూ వివాదంలో భాగమయ్యాడు.