బాబూనే కాదు…టీడీపీ వెక్కివెక్కి!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కొట్టిన భారీ దెబ్బ‌కు టీడీపీ వెక్కివెక్కి ఏడుస్తోంది. మూడు రాజ‌ధానుల‌పై జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌కు చంద్ర‌బాబు స‌హా టీడీపీ నాయ‌కులు, అమ‌రావ‌తి ప్రాంత రైతులు షాక్‌కు గుర‌య్యారు.  Advertisement…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కొట్టిన భారీ దెబ్బ‌కు టీడీపీ వెక్కివెక్కి ఏడుస్తోంది. మూడు రాజ‌ధానుల‌పై జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌కు చంద్ర‌బాబు స‌హా టీడీపీ నాయ‌కులు, అమ‌రావ‌తి ప్రాంత రైతులు షాక్‌కు గుర‌య్యారు. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఇవాళ్టి రోజుకు ఓ ప్ర‌త్యేక‌త ఉంది. మూడు రాజ‌ధానుల‌పై హైకోర్టులో రోజువారీ విచార‌ణ జ‌రుగుతోంది. ఇందులో భాగంగా సోమ‌వారం కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది.

రాజ‌ధానుల‌పై బిల్లుల‌ను ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్టు అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మూడు రాజ‌ధా నుల‌పై జ‌గ‌న్ ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గింద‌ని, అమ‌రావ‌తి రాజ‌ధాని రైతుల పోరాటానికి దిగి వ‌చ్చింద‌నే ప్ర‌చారం కొన్ని గంట‌ల పాటు పెద్ద ఎత్తున జ‌రిగింది. ఈ ప్ర‌చారం జ‌రుగుతుండ‌గానే, మ‌రోవైపు  అసెంబ్లీ స‌మావేశంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. 

మూడు రాజ‌ధానుల‌పై అపోహ‌ల‌ను తొల‌గించేందుకు మ‌ళ్లీ స‌మ‌గ్రంగా బిల్లుల‌ను రూపొందించి, తిరిగి తీసుకొస్తామ‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

ఈ నేప‌థ్యంలో మూడు రాజ‌ధానుల‌పై మీడియాలో మ‌రోసారి పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబు క‌న్నీళ్ల గురించి చ‌ర్చ పూర్తిగా మ‌రుగున ప‌డింది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ్యూహ‌ప్ర‌తివ్యూహాల ఎవ‌రికి తోచిన‌ట్టు వాళ్లు త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో గ‌త రెండు మూడు రోజులుగా చంద్ర‌బాబు వెక్కివెక్కి ఏడ్వ‌డంపై చ‌ర్చ అట కెక్కింది. 

చంద్ర‌బాబు ఏడ్పును రాజ‌కీయంగా సొమ్ము చేసుకునేందుకు టీడీపీ అనేక ర‌కాలుగా వ్యూహాలు ర‌చించింది. ఏపీలో మ‌రే స‌మ‌స్య లేన‌ట్టు …24 గంట‌లూ చంద్ర‌బాబు వెక్కివెక్కి ఏడ్వ‌డం, ఆయ‌న అసెంబ్లీని బ‌హిష్క‌రించ‌డంపై ఎల్లో మీడియా డిబేట్లు కొన‌సాగిస్తుండ‌డాన్ని చూశాం. దీన్నే జ‌నంలోకి మ‌రింతగా తీసుకెళ్లేందుకు టీడీపీ వేసిన ఎత్తుకు జ‌గ‌న్ ప్ర‌భుత్వం పైఎత్తు వేసింది.

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ కొట్టిన దెబ్బ‌కు చంద్ర‌బాబు క‌న్నీళ్లు ఆవిరై పోయాయి. ఇప్పుడు ఆ అంశ‌మే పూర్తిగా మ‌రుగున ప‌డడంతో టీడీపీ జీర్ణించుకోలేక‌పోతోంది. చంద్ర‌బాబు క‌న్నీళ్లు ఓట్లు రాల్చుతాయ‌ని టీడీపీ వేసుకున్న లెక్క‌ల‌న్నీ జ‌గ‌న్ విసిరిన పంచ్‌కు మ‌ట్టికొట్టుకుపోయాయి. అస‌లు జ‌గ‌న్ మ‌న‌సులో ఏముంది? మ‌ళ్లీ వికేంద్రీక‌ర‌ణ బిల్లుల‌ను ఏ విధంగా తీసుకురానున్నారో తెలియ‌క టీడీపీ నాయ‌కులు జుత్తు పీక్కోవాల్సిన దుస్థితి. 

చంద్ర‌బాబు జీవితంలో ఒకే ఒక్క‌సారి క‌న్నీళ్లు కారిస్తే, వాటి ఫ‌లాల‌ను పొందాల‌ని చూస్తే… దాన్ని కూడా జ‌గ‌న్ స‌ర్వ‌నాశ‌నం చేశారు. దీంతో టీడీపీ ఆశ‌ల‌న్నీ అడియాస‌ల‌య్యాయి. ఈ నేప‌థ్యంలో రాజ‌ధానిపై ఎటూ తేల‌క‌, అలాగే చంద్ర‌బాబు క‌న్నీళ్లు వృథా అయ్యాయ‌నే బాధ‌లో… టీడీపీ వెక్కివెక్కి రోదించాల్సిన దుస్థితి ఏర్ప‌డింది. కాలం క‌లిసిరాక‌పోతే …తాడు పామై క‌ర‌వ‌డం అంటే ఇదే కాబోలు. అంతా చంద్ర‌బాబు చేసుకున్న క‌ర్మ కాక మ‌రేంటి? అని స‌ర్ది చెప్పుకోవాలేమో!