ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానులపై మరోసారి సంచలన ప్రకటన చేశారు. ఇది కొందరికి మోదం, మరికొందరికి ఖేదం కలిగిస్తోంది. మూడు రాజధానుల వ్యవహారంపై హైకోర్టులో రోజువారీ విచారణ సాగుతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్‌లో తీర్పు వస్తుందని అందరూ అశించారు. రోజువారీ విచారణలో భాగంగా హైకోర్టు ఘాటు వ్యాఖ్యల గురించి ఎవరికి తోచినట్టు వారు అర్థం చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో మూడు రాజధానులపై బిగ్ ట్విస్ట్. మూడు రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకుంటున్నట్టు గౌరవ న్యాయస్థానానికి ప్రభుత్వం చెప్పింది. మరోసారి సీఆర్‌డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులను …ఎలాంటి సమస్యలకు తావు లేకుండా తీసుకొస్తామని చట్టసభ వేదికగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ప్రకటనపై టీడీపీ యువకిశోరం నారా లోకేశ్ ట్విటర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
“తుగ్లక్ 3.0! మూర్ఖుడు మారాలని కోరుకోవడం అత్యాశే. అసెంబ్లీని అసత్య వేదికగా మార్చేశారు. ఇల్లు ఇక్కడే కట్టా, అమరావతే రాజధాని అంటూ ఎన్నికలకు వెళ్లిన వ్యక్తి మూడు రాజధానులు చెయ్యమని ప్రజలు తీర్పు ఇచ్చారనడం హైలైట్. మురుగు బుర్రలకి మెరుగైన ఆలోచనలు రావడం ఎప్పటికీ జరగని పని” అని లోకేశ్ తనదైన వ్యంగ్య ధోరణిలో ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
జగన్ మారాలని కోరుకోవడం అత్యాశే అని లోకేశ్ అభిప్రాయం. అలాగే మురుగు బుర్రలని జగన్‌తో పాటు ఆయన సహచరులను ఉద్దేశించి లోకేశ్ బుర్ర వెటకరించింది. 2014లో అమరావతిలోనే రాజధాని పెడతామని టీడీపీ ఎక్కడ హామీ ఇచ్చిందో చెబితే సంతోషిస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. దానికి లోకేశ్ ఏమంటారో మరి!