జ‌గ‌న్ వ్యూహాత్మ‌క వెన‌క‌డుగు!

మూడు రాజ‌ధానుల‌పై ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వ్యూహాత్మ‌కంగా వెన‌క‌డుగు వేశారు. మూడు రాజ‌ధానుల బిల్లు, అలాగే సీఆర్‌డీఏ ర‌ద్దు బిల్లును ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్టు హైకోర్టుకు అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ ఇవాళ ఉద‌యం చెప్పారు.  Advertisement దీంతో ఉత్త‌రాంధ్ర‌,…

మూడు రాజ‌ధానుల‌పై ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వ్యూహాత్మ‌కంగా వెన‌క‌డుగు వేశారు. మూడు రాజ‌ధానుల బిల్లు, అలాగే సీఆర్‌డీఏ ర‌ద్దు బిల్లును ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్టు హైకోర్టుకు అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ ఇవాళ ఉద‌యం చెప్పారు. 

దీంతో ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ‌, అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంత రైతులు మిన‌హా మిగిలిన ప్రాంతాల ప్ర‌జానీకం కాసింత నిరుత్సాహానికి గురైంది. అంతేకాదు, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ నిర్ణ‌యంపై ఆగ్ర‌హావేశాలు కూడా వ్య‌క్త‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో ఏపీ అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కుంది.

కాసేప‌టి క్రిత‌మే ఆ ఉత్కంఠ‌కు జ‌గ‌న్ తెర‌దించారు. మూడు రాజ‌ధానుల‌పై వెన‌క్కి త‌గ్గేది లేద‌ని మ‌రోసారి ఆయ‌న తేల్చి చెప్పారు. లంచ్ త‌ర్వాత తిరిగి అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో సీఆర్‌డీఏ బిల్లు ర‌ద్దు, వికేంద్రీక‌ర‌ణ ఉప‌సంహ‌ర‌ణ బిల్లుల‌ను ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ‌రెడ్డి అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టారు. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అవ‌త‌ర‌ణ‌, అభివృద్ధి అస‌మ‌తుల్య‌త‌ల‌పై బుగ్గ‌న కీల‌క ఉపన్యాసం చేశారు. వికేంద్రీక‌ర‌ణ బిల్లుల‌ను తిరిగి మెరుగ్గా తీసుకొచ్చేందుకు… గ‌తంలో ఆమోదించిన వాటిని వెన‌క్కి తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

అనంత‌రం వైఎస్ జ‌గ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ ఆవ‌శ్య‌క‌త‌ను వివ‌రించారు. ఇప్ప‌టికీ రాజ‌ధాని అమ‌రావ‌తే అన్నారు. ఈ ప్రాంతంపై త‌న‌కు ద్వేషం లేద‌న్నారు. ఈ ప్రాంతంపై త‌న‌కు ప్రేమ ఉంద‌న్నారు. ఇక్క‌డే త‌న‌కు ఇల్లు ఉంద‌న్నారు.  

మూడు ప్రాంతాల్లో స‌మాన అభివృద్ధికి త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. ఇందుకోస‌మే మూడు రాజ‌ధానుల‌ను తెర‌పైకి తెచ్చామ‌న్నారు. మూడు రాజ‌ధానుల‌కు వ్య‌తిరేకంగా చాలా అడ్డంకులు సృష్టించారన్నారు.

వికేంద్రీక‌ర‌ణ‌కు సంబంధించి అనేక వివాదాలు, దుష్ప్ర‌చారాలు జ‌రిగాయన్నారు. అంద‌రి అనుమానాలు, అపోహ‌లు తీర్చేందుకు తిరిగి స‌మ‌గ్ర‌మైన వికేంద్రీక‌ర‌ణ బిల్లును తీసుకొస్తామ‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. అన్ని న్యాయ‌, చ‌ట్ట‌ప‌ర‌మైన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌న్నారు. 

ఇంకా ఏమైనా మార్పులు ఉంటే చేయ‌డానికి సిద్ధమ‌న్నారు. గ‌త బిల్లులోని అంశాల‌ను కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటామ‌న్నారు. వికేంద్రీక‌ర‌ణ అవ‌స‌రాన్ని, బిల్లుల్లోని స‌దుద్దేశాన్ని అంద‌రికీ వివ‌రిస్తామ‌న్నారు. 

ఇదిలా వుండ‌గా ఇక అమ‌రావ‌తి మాత్ర‌మే ఏకైక రాజ‌ధానిగా ఉంటుంద‌ని ఆశించిన వాళ్ల‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. జ‌గ‌న్ ఏదో పెద్ద వ్యూహంతోనే ఒక అడుగు వెన‌క్కి వేశార‌నే చ‌ర్చ జరుగుతోంది. అదేంట‌నేది మున్ముందు తెలిసే అవ‌కాశం ఉంది.