తమ ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణకే కట్టుబడి ఉందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లును వెనక్కు తీసుకున్న అనంతరం ముఖ్యమంత్రి జగన్ ఈ అంశంపై మాట్లాడారు. త్వరలోనే సమగ్రమైన వికేంద్రీకరణ బిల్లును తీసుకురాబోతున్నట్టుగా జగన్ ప్రకటించారు. తద్వారా తమ విధానంలో మార్పేమీ ఉండదని, ఈ విషయంలో మరింత కసరత్తు అనంతరం ముందుకు వెళ్లే ఉద్దేశం ఉన్నట్టుగా జగన్ ప్రభుత్వం ప్రకటించింది.
ఈ అంశంపై మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి ముందుగా స్పందించారు. ఏపీ రాజధానికి సంబంధించి గత కొన్నేళ్లలో చర్చలో ఉన్న అంశాలను ఆయన ప్రస్తావించారు. ఏపీకి రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీనే తమకు మార్గదర్శి అని బుగ్గన తేల్చి చెప్పారు.
రాష్ట్రాన్ని విభజించాలనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని వేసిన సంగతి తెలిసిందే. ఆ కమిటీ సుదీర్ఘకాలమే పని చేసి నివేదిక రెడీ చేసినా.. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ నివేదికను పట్టించుకోలేదు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను అసెంబ్లీలో టేబుల్ చేయలేదని బుగ్గన ప్రస్తావించారు.
దేశంలోని వివిధ రాష్ట్రాల అభివృద్ధి మోడళ్లను పరిశీలించినా.. ఒకే నగరానికి, అంతా ఒక చోటే.. అనే రాష్ట్రం ఏదీ లేదన్నారు. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ చుట్టే అన్నీ పరిచారని, ఆ తర్వాత ఏమైందో సీమాంధ్రకే బాగా తెలుసని బుగ్గన అన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు.. గత కొన్ని దశాబ్దాల్లో.. తమ రాష్ట్రాలకు ఏవైనా కొత్త అభివృద్ధి ప్రాజెక్టులో, కేంద్ర ప్రాజెక్టులో వస్తే.. వాటిని తమ తమ రాష్ట్రాల్లోని వేర్వేరు మూలల వైపు పంపి, అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందేలా చూసుకుంటున్నాయనే విషయాన్ని బుగ్గన ప్రస్తావించారు.
అయితే హైదరాబాద్ అనుభవం ఉన్నప్పటికీ.. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మళ్లీ ఒకే చోట అన్నీ అంటూ మొదలుపెట్టిన వైనానికి తాము ససేమేరా సానుకూలం కాదని బుగ్గన తేల్చి చెప్పారు. వికేంద్రీకరణే తమ పాలసీ అని, వికేంద్రీకరణకే తాము కట్టుబడి ఉన్నట్టుగా ఆర్థిక శాఖా మంత్రి క్లారిటీ ఇచ్చారు.
ఈ విషయంలో కొందరికి అభ్యంతరాలున్నాయని, వాటిని కూడా పరిష్కరించి, ముందుకు వస్తామని బుగ్గన అన్నారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. సమగ్రమైన వికేంద్రీకరణ బిల్లు రూపొందుతుందని స్పష్టం చేశారు.