దేశంలో గత కొన్నాళ్లుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఎంతలా అంటే.. ఇప్పుడు రోజువారీ కేసుల సంఖ్య ఎలా ఉందనే అంశం కూడా ఎవరూ పట్టించుకోనంత స్థాయిలో కరోనా గురించి చర్చ తగ్గిపోయింది. రోజువారీగా దేశవ్యాప్తంగా రోజుకు పదివేల స్థాయిలో కేసులు వస్తున్నా ప్రజలు కరోనాను పూర్తిగా మరిచిపోయారు. ఇక కరోనా నియంత్రణ చర్యలు ఏ మేరకు ఉన్నాయనేది వేరే చెప్పనక్కర్లేదు. కరోనానే లేదనుకుంటున్నాకా.. ఇక జాగ్రత్త చర్యలు ఏముంటాయి? దాదాపు ఏమీ లేవు.
నూటికి పది మంది కూడా ఇప్పుడు మాస్కులు ధరించడం లేదు. వ్యాక్సినేషన్ మాత్రం చాలా మంది చేయించుకున్నారు, చేయించుకుంటున్నారు. ఇక మూడో వేవ్ కరోనా అనేది ఇప్పుడు ఊహలకు అందని అంశం లాగానే ఉంది. అది ఉందో లేదో కూడా ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. వైద్య పరిశోధకులు మాత్రం.. మూడు, నాలుగో వేవ్ కూడా ఉంటుందంటారు.
అవెలా ఉన్నా.. దేశంలో మళ్లీ ప్రముఖుల్లో కొందరు కరోనా బారిన పడుతున్న వైనాలు చర్చకు వస్తున్నాయి. ఇటీవలే ఏపీ గవర్నర్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఇటీవలే ఆయన ఢిల్లీలో జరిగిన గవర్నర్ల సదస్సు కార్యక్రమానికి వెళ్లి వచ్చారు. ఆ వెంటనే ఆయనకు అస్వస్థత అని, కరోనా పాజిటివ్ అని వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు మరో ప్రముఖుడు తను కరోనాకు గురైనట్టుగా ప్రకటించారు. ఆయనే కమల్ హాసన్.
తను ఇటీవలే అమెరికా వెళ్లి వచ్చినట్టుగా, గొంతునొప్పి దగ్గు నేపథ్యంలో కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్ గా తేలినట్టుగా కమల్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఇలా తను కరోనా బారిన పడినట్టుగా ధ్రువీకరించారు. దేశంలో కొన్ని కొన్ని చోట్ల గత కొన్ని రోజుల్లో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నట్టుగా కూడా గణాంకాలు చెబుతున్నాయి. ఏదేమైనా జాగ్రత్త చర్యలను తీసుకోవడం మంచిదిలాగుంది.