ఇల్లలకగానే పండుగ అయిపోతుందని అమరావతి రాజధాని ప్రాంతవాసులు భావించారు. దీంతో జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లులను ఉపసంహరించుకోనున్నట్టు హైకోర్టులో ప్రకటించగానే…. ఇక ఏకైక రాజధాని అమరావతి మాత్రమే అని సంబరాలు చేసుకున్నారు. మహాపాదయాత్రలో పాల్గొంటున్న వాళ్లంతా తమ పోరాటానికి ప్రభుత్వం తలొగ్గి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని నమ్మారు.
ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎప్పటికైనా వెనక్కి తీసుకోవాల్సిందే అని అమరావతి జేఏసీ పేర్కొంది. ఇకనైనా అమరావతి ప్రాంతాన్ని త్వరగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేసింది. ఇన్నాళ్లూ అమరావతిని విమర్శించిన వాళ్లు క్షమాపణ చెప్పాలని కూడా అమరావతి జేఏసీ డిమాండ్ చేసింది. అంతేకాదు, ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించే వరకూ ఉద్యమం ఆగదని అమరావతి జేఏసీ హెచ్చరించింది.
పాదయాత్రలో పాల్గొంటున్న వాళ్లు అప్పటికప్పుడు స్వీట్లు తెచ్చుకుని తిని ఆనందాన్ని పంచుకున్నారు. పైగా మూడు రాజధానులపై జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందని, అమిత్‌షా క్లాస్ తీసుకోవడం వల్లే తన నిర్ణయాన్ని మార్చుకున్నారని కొన్ని మీడియా సంస్థలు ఇష్టానుసారం ప్రసారం చేసిన కథనాలు అమరావతి రైతులను బోల్తా కొట్టించాయి. వాళ్ల అంచనాలు తలకిందులు కావడానికి, ఆనందం ఆవిరై పోవడానికి ఎంతో సమయం పట్టలేదు.
ఆలూ లేదు, సూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అనే సామెత చందాన ….ప్రభుత్వం వైపు నుంచి స్పష్టమైన ప్రకటన రాకుండానే అమరావతి జేఏసీ ఎక్కువ ఊహించుకుని అభాసుపాలైంది. మూడు రాజధానులపై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. దీంతో అమరావతి రైతుల మొహాల్లో నెత్తురు చుక్కలేదు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొండితనం గురించి తెలియకపోవడం వల్లే అమరావతి రైతులు…తమ పోరాటానికి సీఎం తలొగ్గి నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని నమ్మి ఏవేవో మాట్లాడారనే సానుభూతి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతే, అంతేగా మరి!