నారా చంద్రబాబునాయుడి అధ్వాన పాలనకు ఆయన తనయుడు లోకేశ్ పాదయాత్ర డైరీ అద్దం పడుతోంది. కనీసం తన సొంత నియోజకవర్గంలోని పేదలకు ఇంటి స్థలం ఇవ్వలేదని, ఇల్లు కట్టివ్వలేదనే వాస్తవాల్ని లోకేశ్ డైరీ కళ్లకు కడుతోంది. దీంతో టీడీపీ శ్రేణులు లబోదిబోమంటున్నాయి. లోకేశ్ అమాయకత్వమా? లేక ఆయన అజ్ఞానమో తెలియదు కానీ, అంతిమంగా చంద్రబాబు పాలనలో ఎవరికీ ఏమీ జరగలేదనే చేదు నిజాన్ని లోకేశ్ డైరీ బయట పెట్టిందంటూ ప్రత్యర్థులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
నారా లోకేశ్ పాదయాత్ర ఇవాళ్టికి నాలుగో రోజుకు చేరింది. రోజువారీ పాదయాత్రలో ముఖ్యమైన అంశాలకు సంబంధించి లోకేశ్ డైరీ రాస్తున్నారు. 29వ తేదీ, మూడో రోజు డైరీని గమనిస్తే, తన తండ్రి చంద్రబాబు కనీసం టీడీపీ పేద కార్యకర్తలకు కూడా ఏమీ చేయలేదనే వాస్తవాన్ని లోకేశ్ రాసుకొచ్చారని వైసీపీ సోషల్ మీడియా చాకిరేవు పెడుతోంది. మూడో రోజు డైరీకి సంబంధించి ఏం రాశారో తెలుసుకుందాం.
“గుడిపల్లి మండలానికి చెందిన సుందరమ్మ అనే చెల్లి మాట్లాడుతూ నాకు ఎందుకు ఇల్లు మంజూరు చేయడలేదని అధికారులను అడిగితే నువ్వు తెలుగుదేశం పార్టీకి చెందిన దానివైనందున ఇవ్వమని చెప్పారని తెలిపింది. అయినా నేనేం బాధపడటం లేదు…మా చంద్రన్న సీఎం అయ్యాక ఇల్లు కట్టించుకుంటానని చెప్పిన ఆమె మాటలకు నా కళ్లు చెమర్చాయి. కుప్పం నియోజకవర్గంలో నాన్నపై ఎంత అభిమానం గూడు కట్టుకుందో ఆ చెల్లి మాటలు ద్వారా తెలుసుకున్నాను”
2014-19 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించిన మహానుభావుడు తన తండ్రి చంద్రబాబే అని లోకేశ్‌కు తెలియదా? మరి అప్పుడు సుందరమ్మ అనే చెల్లికి ఇల్లు మంజూరు చేయాలనే స్పృహ లోకేశ్ అన్నకు, ఆయన నాన్నకు ఎందుకు లేకపోయిందని నెటిజన్లు నిలదీస్తున్నారు. తమ పాలనలో ఇల్లు మంజూరు చేయకపోవడం వల్లే కదా జగన్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనే ప్రశ్న తెరపైకి వచ్చింది. ఐదేళ్ల పాలనలో ఇల్లు కట్టించి ఇవ్వకుండా, ఇప్పుడు సిగ్గులేకుండా మళ్లీ చంద్రన్న వస్తే ఏదో చేస్తారని ఆ చెల్లి చెప్పినట్టు లోకేశ్ గొప్పగా చెప్పుకుంటున్నారని తప్పు పడుతున్నారు.
తమ పాలనలో సొంత పార్టీ కార్యకర్త సుందరమ్మ లాంటి చెల్లికి కూడా ఇల్లు మంజూరు చేయనందుకు లోకేశ్ ఏడ్వాలని వైసీపీ శ్రేణులు హితవు చెబుతున్నాయి. లోకేశ్ పాదయాత్ర పుణ్యాన, ఆయన తండ్రి దుర్మార్గ పాలన ప్రపంచానికి తెలిసొస్తోందని వైసీపీ విమర్శలు చేస్తోంది. ఇదిలా వుండగా లోకేశ్ డైరీ బూమరాంగ్ అవుతుండడంతో టీడీపీ గుక్కపెట్టి ఏడుస్తోంది.