Advertisement

Advertisement


Home > Politics - Opinion

అధికారమా? ప్రజలా?.. లోకేష్ లక్ష్యం ఏంటి?

అధికారమా? ప్రజలా?.. లోకేష్ లక్ష్యం ఏంటి?

రాష్ట్రంలో అధికారమార్పిడి జరిగి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం వచ్చినట్లయితే.. ఆ ఘనతను సంపూర్ణంగా తన ఖాతాలో వేసుకోవడానికి.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న ప్రయత్నం.. యువగళం!. 400రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర ద్వారా.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంటె తాను గొప్పవాడినని నిరూపించుకోవడం.. ముసుగు కింద ఉన్న లక్ష్యం. అసలు ఈ పాదయాత్రకు లక్ష్యం అధికారమా? ప్రజలా? తాము గద్దెపై కూర్చోవడమా? ప్రజా సంక్షేమమా? వారికైనా ఒక స్పష్టత ఉన్నదో లేదో తెలియదు. సంకుచిత ప్రయోజనాలను లక్ష్యించి, విశాల దృక్పథపు ముసుగు కింద చేసే పనులు కాలపరీక్షకు నిలబడవు! యువగళం పాదయాత్ర అనేదే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ!

నారా లోకేష్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు? అనే ప్రాథమిక సందేహం ఎవరికైనా కలిగిందా? సాధారణంగా అత్యున్నత పదవిని అధిష్ఠించే అవకాశం ఉన్న నాయకులు, ప్రజల మంచిచెడులను స్వయంగా తెలుసుకుని, వారితో మమేకమై.. తాము అధికారంలోకి వస్తే ఏం చేయగలమో వారికి హామీ ఇస్తూ తమ భవిష్య ప్రణాళికను తయారు చేసుకోవడానికి ఇలా పాదయాత్ర చేస్తుంటారు.

తెలుగురాష్ట్రంలో ఇప్పటిదాకా జరిగిన పాదయాత్రలు అలాంటివే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసినా, చంద్రబాబునాయుడు చేసినా, జగన్ మోహన్ రెడ్డి చేసినా.. వారే స్వయంగా ముఖ్యమంత్రి అభ్యర్థులు.  నేను సీఎం అయితే మీకు ఫలానా రకంగా సేవ చేస్తా అని వారు చెప్పుకున్నారు. కానీ, లోకేష్ పరిస్థితి వేరు. ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి కారు. పైగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని శాసిస్తామనే నమ్మకం ఉన్న పార్టీ ప్రతినిధి కూడా కాదు. సంకీర్ణంగా అయినా సరే, మరొకరి భుజాల మీదికెక్కి అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీకి చెందిన వాడు. ఇవాళ ఆయన ప్రజలకు ఇచ్చే మాట, రేపు పార్టీ పట్టించుకోకపోతే ఎలా? లోకేష్ ప్రమాణాలకు సంకీర్ణ భాగస్వాములు విలువ ఇవ్వకపోతే ఎలా?

అయినా మనం ఎక్కువ ఆలోచిస్తున్నాం. అసలు ప్రజలకు తాను ఏమైనా మాట ఇవ్వడానికే లోకేష్ ఈ పాదయాత్ర తలపెట్టాడా? అంతా ఉత్తిదే! కేవలం ముఖ్యమంత్రి జగన్ మీద 400 రోజుల పాటు సుదీర్ఘంగా ఊరూరా తిరుగుతూ బురదచల్లడానికి మాత్రమే ఈ యాత్ర! బురద చల్లడం తప్ప, నిందలు వేయడం తప్ప, అబద్ధాలనైనా విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల హృదయాలను కలుషితం చేయడం తప్ప మరొక లక్ష్యం అసలు ఈ యాత్రకు లేదు. ఈ సత్యం ప్రజలకు రోజులు గడిచేకొద్దీ చాలా స్పష్టంగా అర్థమౌతుంది. కానీ నారాలోకేష్ యువగళం యాత్ర వెనుక ‘హిడెన్ ఎజెండా’లు, ‘ముసుగు లక్ష్యాలు’ చాలానే ఉన్నాయి. అవేంటో చూద్దాం..

అస్తిత్వ నిరూపణకు ఆరాటం..

ఇవే నాకు చివరి ఎన్నికలు అంటూ ఆల్రెడీ చేతులెత్తేసిన చంద్రబాబునాయుడు, తన వారసత్వాన్ని కొడుకు చేతిలో పెట్టాలని కలగనడం చాలా సహజం. కానీ అప్రయోజకుడిని నమ్ముకుని తనకు ప్రత్యామ్నాయంగా, పార్టీకి పెద్దదిక్కుగా, ప్రభుత్వాన్ని నడపగలవాడిగా ప్రొజెక్టు చేయాలని చంద్రబాబు కలగన్నంత మాత్రాన ఎలా సాధ్యం అవుతుంది. నారా లోకేష్ ప్రజల పట్ల కన్సర్న్ ఉన్న నాయకుడిగా గానీ, పార్టీ నిర్వహణలో వ్యూహచతురుడుగా విజయాలను సాధించగల సారధిగా గానీ ఏనాడూ తనను తాను  నిరూపించుకోనేలేదు. అయినప్పటికీ.. చంద్రబాబు తన మితిమీరిన పుత్రవాత్సల్యం దాచిపెట్టుకోలేక, దొడ్డిదారిలో ఆయనను మంత్రిని చేశారు. మంత్రి అయిన తర్వాతనైనా కీలకశాఖలను నిర్వహిస్తూ.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు తప్ప.. సమర్థతను నిరూపించుకోలేదు లోకేష్. అమరావతి రాజధానిని అంతగా ఊదరగొట్టిన పార్టీ అభ్యర్థిగా.. అదే ప్రాంతంలో ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయిన దయనీయమైన చరిత్ర ఆయనది. 

అలాంటి లోకేష్ నాయకత్వంలో కనుసన్నల్లో పనిచేయడానికి తెలుగుదేశంలో అందరూ సిద్ధంగానే ఉంటారా?  లోకేష్ కు పైన చంద్రబాబునాయుడు నీడ, ఆశీస్సులు ఉన్నంత వరకు అంతా సవ్యంగా ఉంటుంది. ఇవే చివరి ఎన్నికలంటూ హింట్ ఇస్తున్న చంద్రబాబు పక్కకు తప్పుకుంటే, లేదా, ఆయన పరోక్షంలో పరిస్థితి ఏమిటి? అప్పటికి కూడా పార్టీలోని సీనియర్లంతా లోకేష్  మాటలకు డూడూ బసవన్నల్లాగా తలలు ఊపుతారా? లేదా, అప్పుడు హఠాత్తుగా అందరికీ కొమ్ములు మొలుస్తాయా? అలాంటి పరిస్థితి ఎదురవకుండా ముందే నారా లోకేష్ కు ‘ప్రజలు ఆమోదించిన నాయకుడు’ అనే ట్యాగ్ లైన్ తగిలించడానికి చంద్రబాబునాయుడు రచించిన వ్యూహం, చేస్తున్న  ప్రయత్నం ఈ పాదయాత్ర.

ఆ ధైర్యం ఉందా?

మామను వెన్నుపోటు పొడిచి దక్కించుకున్నదే అయినా తెలుగుదేశం అనేది తన సొంత పార్టీ అని చంద్రబాబునాయుడు భావిస్తున్న తరుణంలో.. వారసుడిగా కొడుకే తర్వాతి సీఎం కావాలని అనుకోవడం ఆయన ఇష్టం. అందుకోసం ఆయన ఎన్ని వ్యూహాలైనా చేయవచ్చు. అయితే, ఆ మాట బహిరంగంగా ప్రకటించి ప్రజల్లోకి వెళ్లగల ధైర్యం తెలుగుదేశానికి, చంద్రబాబుకు ఉందా అనేది కీలకం. నాకిది చివరి చాన్స్, నన్ను ఇంకోసారి ముఖ్యమంత్రిని చేయండి అని బేలగా పలుకుతున్న చంద్రబాబు, నా తర్వాత నా కొడుకు నన్ను మించి మీకు సేవ చేస్తాడు అని ధైర్యంగా చెప్పగలరా? చెప్పలేరు కానీ, ఆయనకు ఆ స్థాయి కట్టబెట్టాలనేది పార్టీమీద కూడా ఆయన చేస్తున్న కుట్ర!

ఆ మాటచెబితే.. ప్రజలు ఆమోదించడం సంగతి తర్వాత.. ముందు ఏ పొత్తులు లేకపోతే గెలుపు గురించి ఆలోచించడం కూడా అనవసరం అని చంద్రబాబునాయుడు భయపడుతున్నారో.. ఆ పొత్తులు కుదిరే అవకాశం కూడా లేదు. చంద్రబాబు అలాంటి మాట అంటే.. పార్టీలో ఎలాంటి తిరుగుబాటు వస్తుందో తర్వాత లెక్కలు వేద్దాం.. కానీ, జనసేనతో పొత్తు బంధం మాత్రం ఏర్పడదు. పవన్ కల్యాణ్ ఛీకొట్టి దూరం జరుగుతారు.. ఇందులో సందేహం లేదు.

చివరి చాన్స్ గా తాను నాలుగోసారి ముఖ్యమంత్రి కావాలని, పద్నాలుగేళ్ల రికార్డును 19ఏళ్లుగా మార్చుకోవాలని చంద్రబాబు అనుకుంటూ ఉంటేనే పవన్ ఒప్పుకోవడం లేదు. పొత్తులతో గెలిస్తే గనుక ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకునేలా డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి దుస్థితిలో ధైర్యంగా మాట చెప్పలేక ఇలాంటి దారి వెతుక్కున్నారు. 

లోకేష్ హామీలకు పవన్ జైకొడతారా?

సూటిగా చెప్పలాంటే.. పవన్ కల్యాణ్ దృష్టిలో నారా లోకేష్ ఎందుకూ పనికిరాని నాయకుడు. తెలుగుదేశంతో విభేదించి స్వతంత్రంగా ఎన్నికల్లోకి దిగిన సందర్భంలో పవన్ కల్యాణ్ లోకేష్ గురించి ఎన్నెన్ని మాటలు అన్నారో ఓసారి చెక్ చేసుకోవాలి. అలాంటి లోకేష్ ఇప్పుడు తనను తాను ప్రజానాయకుడిగా నిరూపించుకోవడానికి పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు ఎన్నెన్నో అలవిమాలిన హామీలు కూడా ఇవ్వవచ్చు. అయితే లోకేష్ తన హీరోయిజం కోసం ఇచ్చే ప్రతి హామీకీ పవన్ జై కొడతారా? తందాన తాన అంటారా? అనేది ఇప్పుడు ప్రశ్న!

అధికార మార్పిడి అంటూ జరిగితే.. కేవలం పవన్ కల్యాణ్ తో పొత్తు వల్ల మత్రమే జరుగుతుంది తప్ప మరొకటి కాదు. అలాంటప్పుడు.. పవన్ కల్యాణ్ వ్యతిరేకించే ఏ నిర్ణయాన్నీ ఆ ప్రభుత్వం తీసుకోజాలదు. మరి కంచిగరుడ సేవలాగా అమలయ్యే దోవ లేనప్పుడు ప్రజల ఎదుటకు వెళ్లి లోకేష్ మాటలు చెప్పడం, వాగ్దానాలు చేయడం అవసరమా? అనేది ప్రశ్న!

ఇంతకూ ఇది వాగ్దానాల యాత్రేనా?

పైన చెప్పుకున్న చర్చ రేగినప్పుడు.. అసలు లోకేష్ సాగిస్తున్నది ప్రజలను ఆకర్షించడానికి వాగ్దానాల యాత్రేనా? లేదా ప్రభుత్వం మీద బురద చల్లే నిందల యాత్రా? అనే సందేహం మనకు కలుగుతుంది. ప్రభుత్వం విధానాల్లో లోపం ఉన్నప్పుడు నిందించడం తప్పు కాదు. కానీ.. పనిగట్టుకుని ప్రతి పనినీ లోపంగా అభివర్ణిస్తూ బురద చల్లాలనుకుంటేనే తప్పు! నాలుగైదు రోజులు లోకేష్ యాత్ర నిరాటంకంగా సాగిందంటే ఆ యాత్ర యొక్క ‘కేరక్టర్’ (బుద్ధి, లక్షణం) అర్థమైపోతుంది. 

విశ్లేషకులు భావిస్తున్న దాన్ని బట్టి.. ప్రజల సమస్యలు తెలుసుకోవడం వారికి మేలు చేయడం లోకేష్ లక్ష్యం కాదు. జగన్ పాలనలో సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరులో.. ప్రజలు అతిగా వ్యక్తీకరించుకునేంత పెద్ద బాధలు అనుభవించడం లేదని ఆయనకు తెలుసు. తనకోసం తన పార్టీ వారు ప్లాంట్ చేసిన ‘కిరాయి’ వ్యక్తులు తప్ప.. పాదయాత్రలో తనను కలిసి మొరలు వినిపించే వారు ఉండరని ఆయనకు క్లారిటీ ఉంది. అయితే ఆయన అది కోరుకోవడం కూడా లేదు. కేవలం జగన్ వ్యతిరేక ప్రచారానికే పాదయాత్ర చేస్తున్నారు. 

పోలీసులపై నిందలే రుజువు!

యాత్రకు అనుమతి అడిగిన తెలుగుదేశం పట్ల పోలీసులు ఏం అనుచితంగా ప్రవర్తించారు. యాత్రలో ఎవరుంటారు? ఎక్కడ బసచేస్తారు? అనిఅడగకుండా భద్రత ఎలా కల్పించగలరు? ఎలా సాధ్యం? ప్రాథమిక వివరాలు అడిగానా కూడా నానా యాగీ చేసిన టీడీపీ తీరును గమనించండి. వారు గగ్గోలు పెట్టినవైనం గమనించండి. బాగా లోతుగా గమనిస్తే ఓ సంగతి అర్థమౌతుంది. వారికి కావాల్సింది యాత్రకు అనుమతులు కాదు. యాత్ర ఆగిపోవడమే వారి కోరిక.

నిబంధనల రూపేణా గానీ, మరో రకంగాగానీ యాత్ర ఆగిపోతే.. అప్పుడు మళ్లీ నాలుగు గోడల మధ్య కూర్చుని.. జగన్ తనను చూసి భయపడుతున్నాడని, పిరికివాడని, అందుకే అనుమతులు ఇవ్వలేదని గప్పాలు కొట్టుకోవడం వారి కోరిక. అందుకే వివరాలు ఇవ్వకుండా కొంత గోలచేశారు. తర్వాత వివరాలు ఇచ్చారు. అనుమతులూ వచ్చాయి. కానీ వారి నిందలు మాత్రొ కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఆదిగా యాత్ర పొడవునా అబద్ధాపు ప్రచారాలు, నిందలు చేయాలనే ఆలోచిస్తున్నారు. ఏదో ఒక రీతిగా అనుమతులు నిరాకరించకపోతారా? యాత్ర ఆగకపోతుందా అని ఎదురుచూస్తున్నారు.

‘అవాంఛనీయ’ కుట్రలున్నాయా?

లోకేష్ పాదయాత్రకు భద్రత కల్పిస్తున్న పోలీసుల మీద ఇప్పటికే బోలెడంత అనుమానాలను ప్రజల్లో సృష్టించారు. ఇక తెలుగుదేశం పార్టీ మరో వ్యూహానికి సిద్ధమవుతున్నట్లుగా కూడా పుకార్లు వినిపిస్తున్నాయి. యాత్రలో అల్లర్లు జరగాలనేదే వారి తాజా కోరిక. పాదయాత్రలో అల్లర్లు జరగాలి. ‘వైసీపీ గూండాలు యాత్రలోకి చొరబడి కుట్రపూరితంగా అల్లర్లు సృష్టించారని, పోలీసులు ప్రేక్షకపాత్ర  వహించారని’  తాము నిందలు వేయాలనేది వారికోరిక. అల్లర్లు జరిగే పరిస్థితి వచ్చేలా.. సామాన్య ప్రజలు కూడా అసహ్యించుకునేలా, తమను చీదరించుకునేలా జగన్ పాలన మీద అసత్యాలు ప్రచారంలో పెట్టాలనేది వారి ఆలోచన. ఏ చిన్న దుర్ఘటన జరిగినా మొత్తం ప్రభుత్వం మీద నెట్టాలని కోరిక. అందుకే పోలీసులు ఈ యాత్ర పట్ల మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం వారికి అలవాటే అని తెలిసిందే గనుక.. జాగరూకతను పాటించాలి. అల్లర్లకు అవకాశం ఇవ్వరాదు. ముందస్తుగా పసిగట్టాలి.

ప్రజల కోసమే తాను పాదయాత్ర చేస్తున్నానని చెప్పదలచుకుంటే.. నారా లోకేష్ పడబోతున్న కష్టం, చేస్తున్న ప్రయత్నం ఆహ్వానించదగ్గవి. గెలుపోటములతో నిమిత్తం లేకుండా అలాంటి పనిచేస్తున్నందుకు శెబాష్ అనొచ్చు. కానీ.. ఆ మాట నిజమేనా కాదా అనే సంగతి.. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే తేలిపోతుంది. ఆయన పాదయాత్రలో ఏం, ఎలా మాట్లాడుతున్నారనే దాన్నిబట్టి ప్రజలు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ సంగతి.. ప్రజల గురించిన అవగాహన లేకుండా నాయకుడిగా చెలామణీ అవుతున్న చినబాబు తెలుసుకుంటే మంచిది.

.. ఎల్. విజయలక్ష్మ్మి

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా