మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌రావు తెనాలి వీడనున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. టీడీపీతో జనసేన పొత్తు కుదిరినా, కుదరకపోయినా తెనాలికి ఆయన స్వస్తి చెప్పనున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆలపాటి రాజా భావిస్తున్నారు. ఈ మేరకు చంద్రబాబుతో తన మనసులో మాట చెప్పినట్టు తెలిసింది. ఇందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున మద్దాల గిరిధర్‌రావు గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన వైసీపీ పంచన చేరారు. దీంతో అక్కడ టీడీపీకి బలమైన అభ్యర్థి అవసరం.
బీజేపీ నేత కన్నా లక్ష్మినారాయణ టీడీపీలో చేరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని మొదట ప్రచారం జరిగింది. అయితే సత్తెనపల్లి నుంచి పోటీ చేయాలని కన్నా నిర్ణయించుకున్నారు. దీంతో ఆలపాటి రాజాకు గుంటూరు పశ్చిమం నుంచి క్లియరెన్స్ లభించింది.
ఒకవేళ టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదిరినా, తెనాలి టికెట్‌ను జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్‌కు కేటాయించాల్సి వుంటుంది. దీంతో ఆలపాటి రాజా పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆలపాటి రాజా ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉన్నారు. గుంటూరు పశ్చిమం టీడీపీకి బలమైన నియోజకవర్గమని ఆలపాటి రాజా అక్కడికి మకాం మార్చేందుకు వ్యూహాత్మకంగా పావులు కదపడం విశేషం.