అనంతపురం జిల్లా రాయదుర్గంతో జమునకి బంధుత్వం వుంది. ఆమె చిన్నాన్న నిప్పాని రంగారావు ఆ వూళ్లో వుండేవాడు. ఊళ్లో జరిగే అన్ని సాంస్కృతిక కార్యక్రమాలకి ఆయనే సమన్వయకర్త. ఆంధ్రప్రభకి రిపోర్టర్ కూడా. ఆయన పోస్టులో వార్తలు పంపితే వారం తర్వాత అచ్చయ్యేవి. ఆయన కొడుకు శ్రీకాంత్ నా క్లాస్‌మేట్. వాడికి చదువు రాదు కానీ, జమున తమ్ముడిగా స్టార్ హోదా వుండేది.
చిన్నప్పుడు జమున చిన్నాన్న ఇంటికి వచ్చేదని అనేవాళ్లు. హీరోయిన్ అయిన తర్వాత ఎప్పుడూ రాలేదు. శ్రీకాంత్ వాళ్ల పెద్దక్క శోభ మద్రాస్‌లో జమున దగ్గరే వుండేది. రాయదుర్గం వస్తే ఆమెని కాబోయే హీరోయిన్‌గా చూసేవాళ్లు. ఆమెకి అవకాశం వచ్చింది కానీ దురదృష్టం కొద్దీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. తర్వాత రంగారావు చనిపోయాడు. ఆ కుటుంబం బళ్లారికి షిప్ట్ అయ్యినట్టు గుర్తు. జమున చాలా దయతో బంధువులందరికీ సాయం చేసేవారని చెప్పుకునేవాళ్లు.
జమునకి సరైన నివాళి జరగలేదు. పెద్ద హీరోలు కానీ, రాజకీయ నాయకులు కానీ రాలేదు. సినిమాకి, రాజకీయాలకి ఆమె చేసిన సేవకి చివరి వీడ్కోలు జరగాల్సిన పద్ధతి అది కాదు. అయితే వారసులు లేకపోతే ఇండస్ట్రీ పట్టించుకోదు. ఏఎన్ఆర్, రామానాయుడు, కృష్ణ వీళ్లంతా గొప్పవాళ్లే. దానికి తోడు వారసులు స్టార్ హోదాలో వున్నారు. అందుకే రాజకీయ నాయకులు, ఇండస్ట్రీ పెద్దలు క్యూ కట్టారు. కాంతారావు కూడా గొప్ప నటుడే. చనిపోయే నాటికి పేదవాడు, వారసులు స్టార్స్ కాదు. ఆయన కోసం ఎందరొచ్చారో మనకు తెలుసు.
జమున కొడుకు పెద్ద నిర్మాత అయి వున్నా, కూతురికి స్టార్ ఇమేజ్ వున్నా ఫిల్మ్ చాంబర్ కిటకిటలాడేది. టీవీలు కంటిన్యూగా లైవ్ పెట్టేవి. పెద్దపెద్ద హీరోలంతా తెల్లటి బట్టల్లో వచ్చి దండం పెట్టి వెళ్లేవాళ్లు.
ఇండస్ట్రీకి ఇలాంటివి కొత్త కాదు. ఎందరో గొప్ప వ్యక్తులు పేదరికం, వారసత్వ లేమితో అనామకంగా వెళ్లిపోయారు. కళామతల్లి ముద్దు బిడ్డలం అని చెప్పుకునే వాళ్లు ఆ బంగారు తల్లికి (మదర్ ఇండియా తెలుగు వెర్షన్‌లో జమున తల్లిగా నటించారు) ఒక విగ్రహమైనా ఏర్పాటు చేస్తే గౌరవంగా వుంటుంది.
జీఆర్ మహర్షి