కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినప్పటికీ ఆ పార్టీ నాయకత్వం గాంధీల కుటుంబం చేతుల్లోనే ఉంటుందని దేశమంతా తెలుసు. కాంగ్రెస్ పార్టీలో వారసులు తప్ప మరెవరూ అధ్యక్ష పదవికి పనికి రారని ఆ పార్టీ నాయకులే గట్టిగా నమ్ముతుంటారు. మధ్యలో పీవీ నరసింహా రావు తప్పించి మొన్నటి వరకు కూడా గాంధీ కుటుంబీకులే అధినేతలుగా కొనసాగారు. సోనియా గాంధీకి ఆరోగ్యం బాగా లేకపోవడం, రాహుల్ గాంధీ నిరాకరించడంతో అధ్యక్ష పదవిని మల్లికార్జున ఖర్గేకు అప్పగించారు. కానీ ఏనాటికైనా మళ్ళీ రాహుల్ గాంధీకే బాధ్యతలు అప్పగించాలని గాంధీ కుటుంబం ఆలోచిస్తోంది. ఖర్గేకు పార్టీ పగ్గాలు అప్పగించడంతో గాంధీ కుటుంబానికి చెందని నాయకుడికి కూడా పగ్గాలు ఇస్తారని దేశానికి మెసేజ్ పంపించారు.
రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాఆయన్ని సమర్ధుడైన నాయకుడిగా పార్టీ సీనియర్లే ఒప్పుకోలేదు. దానికి తగ్గట్లు ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఈ పరిస్థితి రాహుల్లో మార్పు తెచ్చింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని అనుకున్నారు. తనను తాను సమర్ధుడైన నాయకుడిగా నిరూపించుకోవాలకునుకున్నారు. అందుకే “భారత్ జోడో” పేరుతో దేశవ్యాప్త పాదయాత్ర చేశారు. అది జమ్మూ కాశ్మీర్ లో ముగిసింది. దేశంలో కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేదనే విమర్శలకు రాహుల్ గాంధీ నిఖార్సయిన సమాధానం ఇచ్చారని కాంగ్రెస్ నాయకులు సంతోషపడుతున్నారు.
దేశంలో తొలిసారిగా సుధీర్ఘ పాదయాత్ర చేపట్టిన నాయకుడిగా రికార్డు నమోదు చేశారు. పాదయాత్రతో విమర్శకుల నోళ్లను మూయించారని ఆ పార్టీ శ్రేణుల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకుమారుడిలా పెరిగిన రాహుల్ గాంధీకి ప్రజల కష్టనష్టాలు తెలియవని, రాజకీయాలు ఏం తెలుసనే విపక్షాల విమర్శలను భారత్ జోడోయాత్ర తిప్పికొట్టగలిగిందని ఆ పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. పాదయాత్ర ఓట్లను కురిపిస్తుందా? లేదా? అనే విషయాన్ని పరిశీలిస్తే… కాంగ్రెస్ పార్టీని కాపాడుకోడానికి దేశ నాయకుడున్నాడని ఈ పాదయాత్ర నిరూపించిందని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. జోడో యాత్ర… దేశంలో ప్రేమ సందేశాన్ని వ్యాప్తి చేసిందని ప్రియాంకాగాంధీ ట్వీట్ చేశారు.
ఈ రోజు చరిత్రలో గుర్తుండిపోయే రోజు. దేశపౌరుల మద్దతుతో భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా కన్యాకుమారి నుంచి తుది గమ్యస్థానానికి చేరుకుంది. ప్రేమ సందేశం దేశమంతా వ్యాపించిందని ప్రియాంక తెలిపారు. రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రజల్లోనూ విశ్వాసం పెంపొందించింది. కాంగ్రెస్ పార్టీ పగ్గాలను చేపట్టేందుకు అర్హత సాధించిన నాయకుడిగా ఎదిగారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశాలు వచ్చినా.. పాదయాత్ర చేపట్టిన ప్రారంభ సమయంలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించి గాంధీయేతర కుటుంబానికి అప్పగించిన రాహుల్ గాంధీ రాజకీయ అనుభవంకోసం స్వతహాగా తప్పుకున్నారు.
రాబోయే రోజుల్లో పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సమర్థనాయకుడు రాహుల్ గాంధీయేనని ఈ పాదయాత్రతో అర్హత సాధించారని ఆ పార్టీ వర్గాలు అభిప్రాయం వ్యక్తంచేశాయి. వివిధ రాష్ట్రాల్లో ఎడమొహం పెడమొహంతో ఉన్న నాయకులను ఏకతాటిపైకి తీసుకొచ్చారు. వ్యక్తిగత విభేధాలను పక్కనబెట్టి పార్టీ పటిష్టతకోసం పనిచేయాలనే సంకేతాలను జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలతో మమేకమై రాహుల్ గాంధీ ప్రత్యేక అభిమాన నాయకుడిగా ముద్ర వేసుకోగలిగారు. పార్టీ శ్రేణుల్లోనూ సమరోత్సాహాన్ని పెంపొందించారు. కన్యాకుమారినుంచి కాశ్మీర్ శ్రీనగర్ దాకా చేపట్టిన సుధీర్ఘ పాదయాత్ర రాహుల్ గాంధీని నాయకుడిగా తీర్చిదిద్దింది.
ఇన్నాళ్లు గాంధీ కుటుంబంనుంచి వచ్చిన వారసత్వ రాజకీయాన్ని పుణికి పుచ్చుకున్న రాహుల్ గాంధీ పాదయాత్ర పూర్తి చేసి పరిపూర్ణ రాజకీయ నాయకుడిగా నిలిచారు. పార్టీని కాపాడుకోడానికి నిఖార్సయిన నాయకుడని నిరూపించారు. దాదాపు 4 వేల కిలోమీటర్లకు పైగా కొనసాగించిన పాదయాత్రను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ విజయవంతంగా పూర్తి చేశారు. పాదయాత్ర సాగుతున్న సమయంలో తల్లి సోనియాగాంధీ, సోదరి ప్రియాంకా గాంధీ రాహుల్ పట్ల ఆత్మీయత, ఆప్యాయతలను కనబరచారు. భారత్ జోడోయాత్రతో అన్నివర్గాల ప్రజలతో రాహుల్ గాంధీ మమేకమయ్యారు. ఏసీ గదుల్లో పెరిగిన రాహుల్ గాంధీ పాదయాత్రతో గుడారాల్లో నిద్ర, ఆరుబయట ఆకలి తీర్చుకున్న పరిస్థితులు రాహుల్ గాంధీలో పరివర్తన తీసుకొచ్చిందనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.