2019 ఎన్నికల్లో రాయలసీమ లోక్ సభ సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది. తెలుగుదేశం పార్టీకి అత్యంత అనుకూలమైన నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు జెండా ఎగరేశారు. హిందూపురం, చిత్తూరు ఎంపీ సీట్లు తెలుగుదేశం పార్టీకి అత్యంత అనుకూలమైనవిగా పేరు. అలాంటి వాటి చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్తులు భారీ మెజారిటీలతో నెగ్గారు. జగన్ అనుసరించిన సామాజికవర్గ సమీకరణాలు, గట్టిగా వీచిన జగన్ గాలిలో అన్ని ఎంపీ సీట్లూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వశమయ్యాయి.
ఆ సంగతలా ఉంటే.. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు మారతారు అనే టాక్ కూడా నడుస్తోంది. సామాజికవర్గాల సమతుల్యతను పాటిస్తూనే.. అభ్యర్థుల మార్పుకు జగన్ ప్రయత్నించవచ్చు అనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి.
పూర్వ అనంతపురం జిల్లాలో ఒక ఎంపీ సీటును కురుబ సామాజికవర్గానికి, మరో ఎంపీ సీటును బోయ సామాజికవర్గానికి జగన్ కేటాయించారు. అనంత పరిధిలో బాగా జనాభా ఉంటాయి ఈ రెండు సామాజికవర్గాలకు సంబందించి. హిందూపురం ఎంపీ సీటు పరిధిలో కురుబలు ఎక్కువ, ఇక్కడే బోయలూ గణనీయంగా ఉంటారు. అలాగే బోయలు ఈ రెండు ఎంపీ సీట్ల పరిధిలో కూడా గట్టిగా ఉంటారు. వచ్చే సారి కూడా ఈ రెండు నియోజకవర్గాలనూ ఈ రెండు సామాజికవర్గాలకే జగన్ కేటాయించే అవకాశాలున్నాయి. అయితే అదే సామాజికవర్గాల నుంచి మరొకరిని అభ్యర్థులుగా తీసుకు వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి. సర్ ప్రైజింగ్ అభ్యర్తులు వచ్చినా రావొచ్చు. లేదా ఎమ్మెల్యేలు ఎంపీలుగా పోటీ చేసే అవకాశాలూ ఉన్నాయి.
ఇక ఆశ్చర్యకరమైన రీతిలో గత ఎన్నికల్లో కర్నూలు ఎంపీ సీటును బీసీలకు కేటాయించారు జగన్. కాంగ్రెస్ రాజకీయంలో కర్నూలు నుంచి రెడ్లే ఎంపీలుగా వ్యవహరించారు. అయితే జగన్ తన పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి ఈ ఎంపీ సీటును బీసీలకే ఇస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది రెడ్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇలాంటి నేపథ్యంలో ఎంపీ సీటును మాత్రం మరోసారి కూడా బీసీలకే జగన్ కేటాయించే అవకాశం ఉంది. రాయలసీమ మొత్తంలో కూడా చెప్పుకోదగిన స్థాయిలో ఉన్న సాలె లకు జగన్ కర్నూలు సీటును వరసగా రెండు సార్లు కేటాయించారు. మూడో సారి కూడా ఆ సీటు అదే సామాజికవర్గానికి కేటాయించవచ్చు. అయితే ఫ్రెషర్లకు అవకాశాలు ఉండవచ్చు.
ఇక మిథున్ రెడ్డి వచ్చేసారి మరోసారి ఎంపీగా పోటీ చేస్తారా లేక అసెంబ్లీకి వస్తారా అనేది ఆసక్తిదాయకమైన అంశం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ గా బరిలోకి దిగి, మిథున్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అది ఆసక్తిదాయకమైన రాజకీయం అవుతుంది.
అలాగే అవినాష్ రెడ్డి కూడా వచ్చే సారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగే అవకాశాలుండవచ్చు. కడప ఎంపీగా మరొకరిని బరిలోకి దించి అవినాష్ రెడ్డిని ఎమ్మెల్యేగా పోటీ చేయించనున్నారనే టాక్ కూడా ఉంది. నంద్యాల ఎంపీ సీటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. అక్కడి ఎంపీ కూడా చడీచప్పుడు లేకుండా తన పని చేసుకుపోతూ ఉంటారు. సామాన్యుల ఫోన్లకు కూడా పలికే తత్వం నంద్యాల ఎంపీకి పెద్ద అసెట్. ఇక్కడ మార్పు అనివార్యం కాకపోవచ్చు. తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలో నెగ్గిన వ్యక్తే. కాబట్టి మరో అవకాశం దాదాపు ఉండవచ్చు.