నెల్లూరు జిల్లా వైసీపీని ఎపుడూ ఎత్తుకుంటుంది. రెండు సార్లు కూడా అక్కడే ఎక్కువ సీట్లు వచ్చాయి. 2019లో అయితే ఏకంగా స్వీప్ చేసి పారేసింది. అలాంటి నెల్లూరు జిల్లాలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇండైరెక్ట్ గా వైసీపీ సర్కార్ ని టార్గెట్ చేస్తున్నారు. ఆయన ఒకనాడు జగన్ భక్తుడు. ఇపుడు ఆయన తన దేవుడు మీదనే యుద్ధం చేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది.
కోటం రెడ్డి విధేయతను ఎవరూ శంకించాల్సిన అవసరం లేదు. ఆయన పార్టీలో ఆది నుంచి ఉంటూ వస్తున్నారు. ఆయన పెద్ద నోరు వైసీపీకి విపక్షంలో భారీ అడ్వాంటేజ్ అయింది. అయితే ఇపుడు అదే నోరు అధికార వైసీపీకి గరళంగా మారుతోంది. కోటం రెడ్డి బాధ ఏంటో అందరికీ తెలుసు. ఆయన వీర విధేయుడు కాబట్టి ఆయనకు మంత్రి పదవి రావాలి. జగన్ కోసం పార్టీ కోసం లాఠీ దెబ్బలు తిన్నారు, జైలుకు వెళ్లారు. కానీ పదవి దక్కలేదు. దాంతో ఆయనలో అసహనం పెరిగిపోతోంది
ఇదిలా ఉంటే ఆయన తరచూ చేస్తున్న కామెంట్స్ అధికార పార్టీని ఇరకాటంలో పెడుతున్నాయి. అయినా సరే తన భక్తుడు అని జగన్ ఆయన్ని పిలిచి మాట్లాడారు. ఒక విధంగా క్లాస్ తీసుకున్నారు అని అంతా అనుకున్నారు. క్లాస్ తీసుకున్న తరువాత సైలెంట్ గా ఉంటారు అనుకున్న కోటం రెడ్డి ఇంకా ఎక్కువగా సౌండ్ చేస్తున్నారు.
లేటెస్ట్ గా ఆయన ఇవాళ మరోసారి రెచ్చిపోయారు. తన మీద నిఘా పెట్టారని, తన ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు అంటూ చాలా పెద్ద ఆరోపణలనే చేశారు. తాను అధికార పార్టీ ఎమ్మెల్యేను అని తన మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అని ఆయన ప్రశ్నిస్తున్నారు. తన ఫోన్ ని ట్యాప్ చేయాలని చూస్తే కుదిరే వ్యవహారం కాదని, తన వద్ద చాలా ఫోన్లు డజన్ల కొద్దీ సిమ్‌కార్డులు ఉన్నాయని ఆయన బాంబు పేల్చారు.
తాను ఎపుడు ఎలా మాట్లాడాలో తెలుసుకున్నానని అంటున్నారు. తన ఫోన్లు ట్యాప్ అవుతున్న సంగతి తెలిసే ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడి ముగిస్తున్నాను అని అంటున్నారు. ఇలా ఆయన గట్టిగానే అంటున్న మాటలు నేరుగా జగన్ కే తగులుతున్నాయి. ప్రతిపక్షాల మీద నిఘా పెడతారు అని అంటారు. అలాంటి ఆరోపణలు వారే చేస్తారు.
కానీ కోటం రెడ్డి నోటి వెంట ఈ తరహా ఆరోపణలు రావడం చూస్తే వైసీపీ సర్కార్ ఏ విధంగా సమాధానం ఇచ్చుకుంటుంది అని అంతా అంటున్నారు. ఇక కోటం రెడ్డి వ్యవహార శైలి అయితే అర్ధం కాకుండా ఉంది. ఆయన నిబద్ధతతో ఉంటున్నాను అంటూనే మంట పెడుతున్నారు. ఈ మధ్యనే ఆయన నెల్లూరు జిల్లాలోని పెద్ద తలకాయలు తనను అణగదొక్కాలని చూస్తున్నారని ఘాటైన వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. ఇపుడు ఇలా ఆయన నిఘా అంటూ మాట్లాడుతున్నారు.
ఇంతకీ ఆయన పార్టీలో ఉంటారా లేక బయటకు వెళ్తారా అన్నది తెలియడం లేదు. ఇంతకు ముందు నెల్లూరు పెద్దాయన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇలాగే వివాదాస్పద కామెంట్స్ చేస్తే ఆయన్ని సైడ్ చేసి పారేశారు. ఇపుడు శ్రీధర్ రెడ్డి విషయం ఏమి చేస్తారో అని అంటున్నారు. ఆనం అయితే మొదటి నుంచి పార్టీలో లేరు. రేపు ఉండే చాన్స్ లేదు. కాబట్టి ఆయనకు ఆ ట్రీట్మెంట్ సరిపోయింది.
కానీ శ్రీధర్ రెడ్డి లాంటి వారి మీద యాక్షన్ తీసుకుంటే మొదటి నుంచి పార్టీలో ఉన్న వారు నైతిక స్థైర్యం దెబ్బ తింటుంది. మొత్తానికి జగన్ కి వైసీపీకి అతి పెద్ద చిక్కు సమస్యగా కోటం రెడ్డి మారారు. ఒక విధంగా ఆయన రామాంజనేయ యుద్ధం చేస్తున్నారా అన్న చర్చ కూడా వస్తోంది. మరి జగన్ ఏమి చేస్తారు అన్న ఉత్కంథ ఉంది. అలా వదిలేస్తే మరింతమంది కోటం రెడ్డిలు అన్ని జిల్లాలలో తయారుగా ఉంటారు అని అంటున్నారు. మొత్తానికి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే తగ్గేదే లేదు అంటున్నారు.