విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఇది కాస్త షాకింగ్ న్యూస్ నే. తెలుగుదేశం హార్డ్ కోర్ అభిమాని అనుకునే పెద్దాయిన నుంచి అలాంటి సూచన వస్తుందని ఎవరూ ఊహించి వుండరు. కానీ ఇది వాస్తవం అని తెలుస్తోంది. ఇంతకూ విషయం ఏమిటంటే తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇటీవల ఓ ప్రముఖ మీడియా అధినేతను కలిసారు. సుమారు అయిదు గంటల పాటు వారి సమావేశం సాగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఆంధ్రలో రాజకీయ పరిస్థితులు అన్నీ కూలంకషంగా చర్చించినట్లు బోగట్టా.
ఇలాంటి సమయంలో సదరు మీడియా పెద్దాయిన చంద్రబాబుకు ఓ షాకింగ్ సూచన చేసినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం-జనసేన కలిసి పోటీ చేయడంతో పాటు, పవన్ కళ్యాణ్ ను ముందే సిఎమ్ అభ్యర్థిగా ప్రకటించాలన్నది ఆ సంచలన సూచన. ఇలా చేస్తే గెలుపు రెండు వందలశాతం గ్యారంటీ వుంటుందని వివరించారట. పవన్ పార్టీ నిర్మాణం, నడక ఎలా వున్నా, జనాల్లో అతనికి క్రేజ్ వుందని అందువల్ల అతన్ని సిఎమ్ అభ్యర్థిగా ప్రకటిస్తే గెలుపు సులువు అవుతుందని, లేదంటే మళ్లీ చంద్రబాబే సిఎమ్ అభ్యర్థి అంటే చాలా ప్రాక్టికల్ ఇబ్బందులు వస్తాయని వెల్లడించారట.
కేవలం ఇరవై, ముఫై సీట్లు ఇచ్చి పొత్తు పెట్టుకుంటే సరిపోదని, జనసేన అభిమానులు అలా అయితే పని చేయడం పక్కాగా వుండొచ్చు..వుండకపోవచ్చు అని, అదే పవన్ సిఎమ్ అభ్యర్థి అని ప్రకటిస్తే, పోటీ చేసే స్థానాల సంఖ్యతో సంబంధం లేకుండా పని చేస్తారని వివరించారట. సదరు మీడియా పెద్దాయినకు భాఙపా కేంద్ర అధిష్టానంతో చాలా సన్నిహిత సంబంధాలు వున్నాయి. మరి ఈ సలహా అటు వైపు నుంచి ఈ రూట్ లో వచ్చిందా అన్నది ఓ అనుమానం. చంద్రబాబు కు అంటే అధికారం కావాలి కానీ, సదరు మీడియా పెద్దాయినకు జగన్ దిగిపోతే చాలు. మరెవరు సిఎమ్ గా వున్నా తన మాట చెల్లుతుందనే ధీమా వుంది.
కానీ చంద్రబాబు ఈ ప్రతిపాదనకు వెంటనే అక్కడే నో చెప్పినట్లు తెలుస్తోంది. ఇది తనకు ఫైనల్ బ్యాటిల్ అని, మీరు చెప్పిన ప్రకారం చేస్తే తను సిఎమ్ కాలేనని, ఒక వేళ మీరు చెప్పినట్లు చేయకపోయి, మీ అంచనా ప్రకారం ఓడి పోయినా సిఎమ్ కాలేనని, రెండింటి రిజల్ట్ ఒకటే అయినపుడు తను సిఎమ్ గా పవన్ ను ప్రతిపాదించడం వృధా అని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది.
దాంతో సదరు పెద్దాయినకు మౌనమే సమాధానం అయిందని తెలుస్తోంది. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ఈ గుసగుస ఎంత వరకు నిజం అన్నది పక్కన పెడితే, నిజం కావడానికే ఎక్కువ అవకాశాలు వున్నాయి. ఎందుకంటే సదరు మీడియా పెద్దాయినకు ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ మరోసారి సిఎమ్ కావడం ఇష్టం లేదు. ఇది తనకూ పెద్ద సమస్య. అందుకు అవసరం అయితే చంద్రబాబుకు బదులు పవన్ ను ముందుకు పెట్టడానికి కూడా తను సిద్దం. పైగా వెనుక భాజపా సంబంధాలు వుండనే వున్నాయి.
కానీ చంద్రబాబు అంత త్యాగం చేయడం అసాధ్యం. ఇప్పుడు ఈ ఎన్నికల్లో నెగ్గి, లోకేష్ ను సిఎమ్ ను చేయకపోతే మరి అతనికి రాజకీయ భవిష్యత్ దాదాపు అసాధ్యం అయిపోతుంది. అందుకే తన స్టయిల్ యుద్దానికే బాబు రెడీ అయ్యారు. తన రాజకీయ గురువు అనిపించుకున్న పెద్దాయిన మాట వీటో చేసారు అని అనుకోవాల్సిందే.