“3 రాజధానుల ఉపసంహరణ. ఏపీ హైకోర్టుకు తెలిపిన అడ్వకేట్ జనరల్. దీనిపై ప్రభుత్వం నుంచి మరికాసేపట్లో ప్రకటన.” ఇలా 3 రాజధానుల అంశం నుంచి ప్రభుత్వం పూర్తిగా వైదొలిగిందని అంతా అనుకుంటున్నారు.
కానీ అసలు కథ ముందుంది. కేవలం లీగల్ గా ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడేందుకు మాత్రమే, ప్రస్తుతం అమల్లో ఉన్న అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఉపసంహరించుకున్నట్టు తెలుస్తోంది.
దీనికి సంబంధించి మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అంతా చూస్తున్నది కేవలం ఇంటర్వెల్ మాత్రమేనని ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వం 3 రాజధానుల అంశం నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తి లేదంటున్నారాయన.
“నా వ్యక్తిగత అభిప్రాయంలో ఇది ఇంటర్వెల్ మాత్రమే. ఇప్పుడు జరిగిన విషయాన్ని పరిగణలోకి తీసుకొని 3 రాజధానుల ఇష్యూ ముగిసిపోయిందని, ఫలానా చోట రాజధాని పెడతారని అనుకోవద్దు. ఇప్పుడు ఇంటర్వెల్ మాత్రమే. శుభం కార్డు పడేవరకు సినిమా రన్ అవుతుంది. ఆ రోజు ఏం జరుగుతుందో చూస్తారు.”
మూడు రాజధానుల అంశానికి సంబంధించి మరింత పకడ్బందీగా బిల్లును రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈసారి ఎలాంటి చట్టపరమైన అడ్డంకులు లేకుండా ఉండాలని గట్టిగా నిర్ణయించింది. అలా కొత్త బిల్లును తీసుకురావాలంటే, ఆల్రెడీ అమల్లో ఉన్న అభివృద్ది వికేంద్రీకరణ బిల్లును ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్నది అదే. అంతమాత్రానికే ఇదేదో అమరావతి రైతుల విజయంగా ఎల్లో మీడియా పొంగిపోతోందని అంటున్నారు పెద్దిరెడ్డి.