నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. మరోసారి ఆయన అధికారుల పేరుతో సొంత ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు ఇటీవల కాలంలో తరచూ ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో జగన్ సర్కార్ ఇరకాటంలో పడుతోంది. ఈ నేపథ్యంలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిపై అధికార పార్టీ వేటు వేసింది.
ఆనం కోరలు తీసేయడంతో ప్రస్తుతం ఆయన నోరు మెదపడం లేదు. వెంకటగిరి వైసీపీ ఇన్‌చార్జ్‌గా నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. ఇదిలా వుండగా తరచూ అధికారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని కూడా సీఎం జగన్ ఇటీవల పిలిపించుకుని మాట్లాడారు. దీంతో అంతా సద్దుమణిగిందని భావిస్తున్న తరుణంలో ఇవాళ మరోసారి శ్రీధర్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేయడం గమనార్హం. తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని, అధికార పార్టీ అయిన తనపై నిఘా ఉంచడం ఏంటని ఆయన నిలదీయడం సంచలనం రేకెత్తిస్తోంది.
వైసీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేలా ఆయన ఆరోపణలున్నాయి. తన మీద, తన కదలికలపై ఇంటెలిజెన్స్ అధికారులు ముగ్గరు అధికారులతో నిఘా పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. మూడు దశాబ్దాలకు పైబడి రాజకీయాల్లో ఉన్నానని, ఎప్పుడెలా నడుచుకోవాలో తనకు బాగా తెలుసన్నారు. తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్న విషయం ముందే తెలుసన్నారు. అందుకే ఆ ఫోన్లో ఏం మాట్లాడాలో అంత వరకే పరిమితం అవుతున్నట్టు చెప్పారు.
రహస్యాలు మాట్లాడుకునేందుకు తన వద్ద వేరే ఫోన్ వద్దని, భారీగా సిమ్‌కార్డులున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. చేతనైతే వాటిని ట్యాప్ చేయాలని, ఇందుకోసం అవసరమైతే ప్రత్యేక అధికారిని నియమించుకోవాలని ఆయన సవాల్ విసరడం గమనార్హం. క్రికెట్ బెట్టింగ్ కేసుల సమయంలో అప్పటి ఎస్పీ తన ఫోన్‌పై నిఘా ఉంచారన్నారు. ఈ సమాచారం తెలిసి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మాట్లాడేవాన్ననన్నారు. ఫేస్ టైమర్, టెలిగ్రాం కాల్స్‌ని పెగాసస్ రికార్డు చేయలేదన్నారు.
కోటంరెడ్డి సంచలన ఆరోపణలపై వైసీపీ సర్కార్ అవాక్కవుతోంది. ఎలా స్పందించాలో ప్రభుత్వ పెద్దలకు అర్థం కాని పరిస్థితి. అధికారుల భుజాలపై గన్ పెట్టి సొంత ప్రభుత్వాన్ని కోటంరెడ్డి బద్నాం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కోటంరెడ్డి మనసులో ఏదో పెట్టుకుని సీఎం జగన్‌ను నేరుగా విమర్శించలేక, మరో మార్గంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోటంరెడ్డి వ్యవహారశైలిపై అధికార పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.