మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ మృతిపై జనసేనాని పవన్‌కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వట్టితో తనకు బంధుత్వం కూడా ఉన్నట్టు ఆయన తెలిపారు. అన్నిటికి మించి జనసేనకు మొదటి విరాళం ఇచ్చిన నేత వట్టి వసంత్‌కుమార్ అని చెప్పి ఆయన ఆశ్చర్యపరిచారు.
గతంలో పవన్‌కల్యాణ్‌తో వట్టి వసంత్‌కుమార్ భేటీ అయ్యారు. దీంతో జనసేనలో వట్టి చేరుతారనే ప్రచారం జరిగింది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డితో వట్టి వసంత్‌కుమార్‌కు సన్నిహిత సంబంధాలుండేవి. కానీ వైఎస్ జగన్ వెంట ఆయన నడవలేదు.
చివరిగా కాంగ్రెస్ పార్టీతోనే సంబంధాలు కొనసాగించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు కూడా దూరంగా ఉన్నారు. తన సామాజిక వర్గానికి చెందిన పవన్‌కల్యాణ్ శ్రేయోభిలాషిగా వట్టి వసంత్ సలహాలు ఇచ్చారని తాజాగా జనసేనాని అభిప్రాయాల్ని బట్టి తెలుస్తోంది. వట్టి వసంత్‌కుమార్ మరణవార్త తెలిసిన వెంటనే పవన్ స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా తన పురోగతిని వట్టి ఆకాంక్షించారన్నారు. అలాగే జనసేనకు విరాళం ఇచ్చిన మొట్టమొదటి నాయకుడు వట్టి వసంత్‌కుమారే అని బహిరంగంగా పవన్ చెప్పడం విశేషం.
పంజా సాయిధరమ్ తేజ్ ద్వారా వసంత్‌కుమార్‌తో తనకు బంధుత్వం వుందన్నారు. పోరాట యాత్ర సందర్భంగా వసంత్‌తో తాను భేటీ అయిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఎన్నో సందర్భాల్లో వసంత్‌కుమార్‌తో చర్చలు జరపానన్నారు. తనను ప్రోత్సహించేలా వట్టి మాట్లాడేవారన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని పవన్ ఆకాంక్షించారు. ఆ నాయకుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.