తెలుగుదేశం చినబాబు నారా లోకేష్ పాదయాత్ర రాయలసీమ జిల్లాలలో ఎక్కడో కర్నాటక బోర్డర్ లోని కుప్పంలో స్టార్ట్ అయింది. ఈ పాదయాత్రకు జన సందోహం అంటూ టీడీపీ అనుకూల మీడియా ఒక్క లెక్కన హోరెత్తిస్తోంది. కుప్పం ఎటూ తెలుగుదేశం పార్టీ సీటే. చంద్రబాబు లోకల్ ఎమ్మెల్యే.
అందువల్ల క్యాడర్ కి లోటు లేదు. కానీ చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం కంటే వైసీపీ రాజకీయ ప్రాబల్యమే ఎక్కువ. దాంతో తెలుగుదేశం పార్టీ తెలివిగానే రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నేతలను క్యాడర్ ని పెద్ద ఎత్తున లోకేష్ పాదయాత్రకు తరలించింది అంటున్నారు.
ఉత్తరాంధ్రా నుంచి అలా పెద్ద సంఖ్యలో లోకేష్ పాదయాత్రకు తమ్ముళ్ళు తరల్లి వెళ్ళారు. పాదయాత్ర ప్రారంభం చూసుకుని వచ్చేయకుండా ఆయనతో పాటే నడుస్తున్నారు. తిరుగుతున్నారు. శ్రీకాకుళం నుంచి విజయనగరం విశాఖ జిల్లాల నుంచి చాలా మంది నాయకులు ఇలా చలో కుప్పం అంటూ మకాం మార్చేశారు.
ఎక్కడ చూసినా వారే కనిపించడంతో చినబాబు పాదయాత్రను ఉత్తరాంధ్రా తమ్ముళ్ళు తమ భుజాల మీద మోస్తున్నారు అని అంటున్నారు. లోకేష్ పాదయాత్ర అన్ని జిల్లాలను దాటుకుని ఉత్తరాంధ్రా జిల్లాలకు చేరుకునేసరికి ఈ ఏడాది చివరికి అవుతుంది అని అంచనా వేస్తున్నారు.
అందువల్ల అప్పటికి చాలా సమయం ఉన్నందువల్ల ఇపుడు అలసిసొలసినా బే ఫికర్ అనుకుంటూ తమ్ముళ్ళు లోకేష్ కంట పడేందుకు క్యూ కడుతున్నారు. పనిలో పనిగా తమ టికెట్ వ్యవహారాల మీద మాటా మాంతీకి చూసుతున్నారు అని అంటున్నారు. అయితే టికెట్ రేసులో ఉన్న వారు రెండు వర్గాలూ పాదయాత్రకు పోటీగా వెళ్లడంతో జనాల సందడికి ఢోకా లేకపోయినా టికెట్ మీద మాత్రం తమ్ముళ్లకు భరోసా అయితే దక్కడంలేదు అని అంటున్నారు.